Katipally Venkataramana Reddy | తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అధికార మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు.
64 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే ఈ ఎన్నికల్లో పలు సంచలనాలు నమోదయ్యాయి.
ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గం అందరి ద్రుష్టిని ఆకర్షించింది. అక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో ఆసక్తి నెలకొంది.
అయితే అక్కడ ఊహించని ఫలితం వచ్చింది. ఇద్దరు సీఎం క్యాండిడేట్లను ఓడించారు బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి. 6,741 ఓట్ల తేడాతో విజయ దుందుభి మోగించారు.
కాటిపల్లికి 66,652 ఓట్లు రాగా.. సీఎం కేసీఆర్ 59,911 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి 54,916 ఓట్లతో మూడోస్థానానికి పరిమితమయ్యారు.
రాష్ట్రరాజకీయాల్లోనే ఇద్దరు బలమైన నేతలను ఓడించి కాటిపల్లి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు సాధించారు.
ఎవరీ కాటిపల్లి..
కాటిపల్లి వెంకట రమణారెడ్డి స్వస్థలం కామారెడ్డి పట్ణణం. కామారెడ్డిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో 1987లో ఇంటర్ పూర్తి చేశారు.
కామారెడ్డిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ అనుచరుడిగా కాంగ్రెస్ లో పనిచేశారు. రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని అయిన కాటిపల్లి, ఆయన మరణానంతరం వైసీపీలో చేరారు.
కొంతకాలం తర్వాత బీజేపీలో చేరి 2018 ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు ఓటమి చెందినా, తన తండ్రి పేరిట ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి, కామారెడ్డి నియోజకవర్గంలో సొంత ఖర్చులతోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.
పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తుల్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు విరాళంగా ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకూ దాదాపు రూ.50 కోట్ల దాకా సొంత ఖర్చుతో ఎన్నో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
సొంత మేనిఫెస్టో..
తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు వెంకటరమణా రెడ్డి. అయితే సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి కూడా పోటీ చేయడంతో ఈ సీటు హాట్ టాపిక్ గా మారింది.
అయితే కామారెడ్డిలో వెంకటరమణా రెడ్డికి ప్రజల మద్దతు ఉంది. అంతే కాకుండా మరోవైపు బీజేపీతో సంబంధం లేకుండా తాను వ్యక్తిగతంగా ఓ మేనిఫెస్టోను రూపొందించారు.
నియోజకవర్గంలో ఏయే గ్రామంలో, ఏయే పనులు చేపడతారో అందులో వివరించారు. ఈ మేనిఫెస్టో కోసం ఏకంగా రూ.150 కోట్లను ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారు.
లోకల్, నాన్ లోకల్ ఫ్యాక్టర్..
కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ నాన్ లోకల్. కానీ, రమణారెడ్డి పక్కా లోకల్.
పైగా గత పదేళ్లుగా ప్రజల మధ్యే ఉన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలకు కామారెడ్డి ప్రజలతో అసలు ఏ సంబంధమూ లేదు.
పైగా వీరిలో ఎవరు గెలిచినా మళ్లీ అక్కడ రాజీనామా చేసి వెళ్లిపోతారని కామారెడ్డి ప్రజలు బలంగా భావించారు. వెంకటరమణా రెడ్డి అయితే తమతోనే ఉంటారని విశ్వసించారు.
హేమా హేమీలు పోటీ చేసినా, తన వెంట ఉండే స్థానిక నాయకుడికే కామారెడ్డి ప్రజలు పట్టంగట్టారు. ఇద్దరి సీఎం అభ్యర్థులను ఓడించి, రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక చరిత్ర స్రుష్టించారు.