Yadagirigutta Dress code | తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయం కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు ఇకనుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయనుంది.
నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని నియమం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నియమం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. నిత్య కల్యాణం, హోమం, జోడు సేవలు, శ్రీసుదర్శన నారసింహ హోమం, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు తదితర ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా నియమాన్ని అమలు చేయనుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదాద్రిలో కూడా భక్తుల వీఐపీ బ్రేక్ దర్శనానికి డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసింది. స్వామి వారి బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులకు తప్పనిసరిగా ఈ నిబంధన వర్తిస్తుందని దేవస్థానం తెలిపింది.
అయితే సాధారణ ధర్మ దర్శనం క్యూలైన్‌లో వచ్చే భక్తులకు ఈ నియమం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు యాదగిరిగుట్ట పేర్కొంది. జూన్ 1వ నుంచి అమలయ్యే సంప్రదాయ వస్త్రధారణకు భక్తులందరూ సహకరించాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.