Karimnagar | కరీంనగర్ లోని ఆర్టీసీ బస్టాండ్ లో పురిటి నొప్పులు వచ్చిన మహిళకు అక్కడి సిబ్బంది ప్రసవం చేశారు. మానవత్వం పరిమళించిన ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే ఒడిషాకు చెందిన కుమారి-దూల దంపతులు పెద్దపల్లి, సుల్తానాబాద్ వద్ద ఇటుకల బట్టిలో పనిచేస్తున్నారు. కుమారి 9 నెలల నిండు గర్భిణీ. ఈ క్రమంలో వారి స్వస్థలానికి వెళ్లేందుకు దంపతులు కరీంనగర్ బస్టాండ్ కు చేరుకున్నారు.
అయితే కుమారికి నొప్పులు ప్రారంభం అయ్యాయి. వెంటనే భార్యను చెట్టు కింద పడుకోబెట్టిన భర్త, ఆ తర్వాత ఆర్టీసీ సిబ్బంది వద్దకు వెళ్లి సహాయం కోరారు. ఇంతలోనే మహిళకు పురిటి నొప్పులు పెరగడంతో బస్టాండ్ లో పనిచేసే స్వీపర్లు, సూపర్ వైజర్, ఆర్టీసీ సిబ్బంది చీరలను అడ్డుగా కట్టి కుమారికి ప్రసవం చేశారు.
అనంతరం అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లీ, బిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా కుమారికి పురుడుపోసిన ఆర్టీసీ స్వీపర్లు సైదమ్మ, స్రవంతి, లావణ్య, భవానీ, రేణుకను అధికారులు, ప్రయాణికులు అభినందించారు.