App For Begging | ప్రస్తుతం ఉన్నది డిజిటల్ యాప్ (Digital Apps)ల ప్రపంచం. మొబైల్ ఉంటే చేతిలో ప్రపంచం ఉన్నట్లే. ఎక్కడి నుంచి ఏం కావాలన్నా.. ఏం కొనాలన్నా ఓ యాప్ ఓపెన్ చేసి జస్ట్ ఇలా ఒక క్లిక్ చేస్తే చాలు అన్నీ ఇంటికొచ్చేస్తాయి.
ఎక్కడికెళ్లినా జేబులో క్యాష్ అక్కర్లేదు. పేమెంట్ యాప్ ఓపెన్ చేసి అలా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసేస్తే చాలు. ఈ డిజిటల్ యుగం ఎంతగా అప్ డేట్ అయ్యిందంటే యాచకులు కూడా క్యూ ఆర్ కోడ్ తో అడుక్కుంటున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఓ వ్యక్తి ఏకంగా అడుక్కోవడానికి కూడా ఓ యాప్ రూపొందిస్తున్నట్లు ప్రకటించాడు. ‘westafrikanman’ అనే ఓ ఇన్స్ పేజీ డిజిటల్ బెగ్గింగ్ కు సంబంధించిన ఓ ఆసక్తికర పోస్టును షేర్ చేసింది. త్వరలో ‘బెగ్ర్ (Begr)’ అనే పేరుతో అడుక్కోవడానికి ప్రత్యేకంగా ఓ యాప్ లాంచ్ చేయబోతున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు.
ఈ యాప్ ద్వారా ప్రజలు ధనవంతులను డబ్బులు అడుకోవచ్చని తెలిపారు. గరిష్టంగా 10 బిలియన్ వరకు అడుకునే అవకాశం ఉంటుందట. అయితే దీనికి ఓ కండీషన్ కూడా పెట్టారు. నెలకు కేవలం రెండు సార్లు మాత్రమే అడుక్కోవాలట. మరో ముఖ్యమైన కండీషన్ ఏంటంటే.. ఈ యాప్ సీఈఓకు అడుకున్న దాంట్లో 20 శాతం కమిషన్ ఇవ్వాలట. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.