Vande Bharat Sleeper Water Test | భారతీయ రైల్వేలో వందేభారత్ (Vande Bharat) రైలుతో ఒక నూతన శకం ఆరంభమైంది. ప్రయాణీకులు ఎదురు చూస్తున్న ‘వందేభారత్ స్లీపర్’ (Vande Bharat Sleeper) రైలు కూడా త్వరలో అందుబాటులోకి రానుంది.
తాజాగా ఈ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwani Vaishnav) వందేభారత్ స్లీపర్ రైలుకు సంబంధించి ఆసక్తికర వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కోటా-నాగ్డా సెక్షన్ మధ్య జరిగిన ఈ పరీక్షలో రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించింది.
ఈ సందర్భంగా రైలు స్థిరత్వాన్ని పరీక్షించేందుకు అధికారులు వినూత్నంగా ‘వాటర్ టెస్ట్’ నిర్వహించారు. రైలు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో లోపల టేబుల్ మీద పిరమిడ్ ఆకారంలో నీటి గ్లాసులను ఒకదానిపై ఒకటి పేర్చారు.
ఆ సమయంలో గ్లాసుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా కింద పడలేదు. వీడియోలో మొబైల్ స్పీడోమీటర్ పై 182 కిలోమీటర్ల వేగం కనిపిస్తున్నప్పటికీ, రైలు ఏమాత్రం కుదుపులకు లోనుకాకుండా సాఫీగా ప్రయాణించింది. దీంతో ఇది ఈ కొత్త తరం రైలు సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనమని మంత్రి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.






