Uniform Civil Code | దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న యూనిఫాం సివిల్ కోడ్ (యుసీసీ) బిల్లుకు సంబంధించి కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ యూసీసీ బిల్లు ముస్లింలు లేదా గిరిజన వర్గాల ప్రయోజనాలకు హాని కలిగించదని తెలిపారు. యూసీసీ వర్గాల మధ్య ఐక్యత మరియు సామరస్యానికి హామీ ఇస్తుందని బుధవారం ఢిల్లీలో మీడియాతో చెప్పారు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
‘యూసీసీపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. హిందువులు, ముస్లింల మధ్య ఐక్యత మరియు సామరస్యాన్ని నిర్ధారించడానికి యూసీసీ అవసరం.
అప్పట్లో మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కూడా యూసీసీకి అనుకూలంగా ఉండేవారు” అని మహారాష్ట్రకు చెందిన దళిత నాయకుడు అథవాలే అన్నారు.
“యుసిసి మీకు వ్యతిరేకం కాదని నేను ముస్లింలకు చెప్పాలనుకుంటున్నాను. దీనిపై రాజకీయాలు చేయకుండా అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలి.
గిరిజనులందరూ దీనికి వ్యతిరేకం కాదు. ఈ చట్టం గిరిజనులకు, దళితులకు, హిందువులకు లేదా ముస్లింలకు వ్యతిరేకం కాదు. యుసిసిని తీసుకురావడం చాలా ముఖ్యం” అని మంత్రి పేర్కొన్నారు.
చాలా కాలంగా వివాదాస్పదంగా ఉన్న యూసీసీ గురించి మతపరమైన సంస్థలతో పాటు ప్రజల నుండి అభిప్రాయాలు మరియు సూచనలను జూన్‌లో లా కమిషన్ ఆహ్వానించింది.
ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా 2024 లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) మరోసారి 325 సీట్లకు పైగా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరుసగా మూడోసారి మోదీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.
రాహుల్ గాంధీకి తదుపరి ప్రధాని అయ్యే అవకాశం రాదని, కాంగ్రెస్ నాయకుడు ప్రతి అంశాన్ని రాజకీయం చేయవద్దని అథవాలే హితవు పలికారు.