Chandra Mohan | తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు చంద్రమోహన్ (78) కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9.45 గంటలకు తుదిశ్వాస విడిచారు.
చంద్రమోహన్ కొన్నేళ్లుగా గుండె జబ్బు సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతకొంతకాలంగా డయాలసిస్ కూడా చేయించుకున్నారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో జరగనున్నాయి.
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. 1945 మే 23న కృష్ణాజిల్లా పమిడిముక్కలలో చంద్రమోహన్ జన్మించారు.
డిగ్రీ వరకు చదువుకున్న చంద్రమోహన్ కొంతకాలం ఏలూరులో బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌కి వరుసకు తమ్ముడు అవుతారు.
చంద్రమోహన్ 1966లో ‘రంగుల రాట్నం’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి తెరంగేట్రం చేశారు. మొదటి చిత్రానికే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల అనుభవంలో హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక పాత్రల్లో నటించారు.
తెలుగులో ఒకప్పుడు గొప్ప హీరోయిన్లు వెలిగిన వారందరూ చంద్రమోహన్ సినిమాలతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
చంద్రమోహన్ సరసన హీరోయిన్‌గా నటిస్తే తిరుగు ఉండదనే భావన చాలా మంది హీరోయిన్లలో ఉండేది. జయసుధ, జయప్రద, సుహాసిని తదితర స్టార్ హీరోయిన్లు అందరూ తొలినాళ్లలో ఆయన పక్కన నటించినవారే. మొత్తం 932 పైగా సినిమాల్లో చంద్రమోహన్ నటించారు.
1978లో వచ్చిన ‘పదహారేళ్ల వయసు’ సినిమాలో నటనకు గానూ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. 1987లో ‘చందమామ రావే’ సినిమాలో నటనకు కూడా నంది అవార్డు అందుకున్నారు.
‘అతనొక్కడే’ సినిమాలో సహాయ నటుడిగా నంది అవార్డు దక్కించుకున్నారు.
తెలుగుతో పాటు తమిళంలోనూ చంద్రమోహన్ సినిమాలు చేశారు. చంద్రమోహన్ సతీమణి జలంధర ఒక రచయిత్రి. ఈ దంపతులకు మధుర మీనాక్షి, మాధవి ఇద్దరు కుమార్తెలు.
మధుర మీనాక్షి సైకాలజిస్ట్ గా అమెరికాలో స్థిరపడ్డారు. రెండో కుమార్తె మాధవి కూడా డాక్టరే. ఆమె చెన్నైలో ఉంటున్నారు.