TGSRTC Record On Rakhi Pournami | రాఖీ పౌర్ణమి (Rakhi Pournami) పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సరికొత్త రికార్డులు నమోదు చేసింది. రక్షాబంధన్ రోజు రికార్డు స్థాయిలో ప్రయాణికులను ఆర్టీసీ తమ గమ్యస్థానాలకు చేరవేసింది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 63.86 లక్షల మంది బస్సుల్లో ప్రయాణం చేశారు.
ఒక్కరోజులోనే 41.74 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వినియోగించుకున్నారు. 21.12 లక్షల మంది నగదు చెల్లించి బస్సుల్లో ప్రయాణం చేశారు. రాఖీ రోజున రికార్డు స్థాయిలో రూ.32 కోట్ల రాబడి ఆర్టీసీకి వచ్చిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు రాబడి రాగా.. నగదు చెల్లింపు టికెట్ల ద్వారా మరో రూ.15 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని తెలిపారు. భారీ వర్షంలోనూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.