Actress Prathyusha Death Case | దాదాపు పాతికేళ్ల కిందట 2002 సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష మృతి కేసు (Pratyusha Death Case) లో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
నాలుగు వారాల్లో అతడిని లొంగిపోవాలని ఆదేశించింది. గతంలో హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్థించింది. ఇంటర్ చదువుతున్న సమయంలో ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి ప్రేమలో పడ్డారు. అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి ప్రవేశించగా, సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు.
2002 ఫిబ్రవరి 23న ఇద్దరూ విషం తాగిన స్థితిలో ఆసుపత్రిలో చేరగా, ఫిబ్రవరి 24న ప్రత్యూష మృతి చెందారు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో తేలింది. సిద్ధార్థరెడ్డి చికిత్స అనంతరం మార్చి 9న డిశ్చార్జ్ అయ్యాడు.
మొదట ఇది ఆత్మహత్యగా నమోదైనప్పటికీ, 2004లో పోలీసులు హత్య కేసుగా మార్చారు. ఆత్మహత్యకు ప్రేరేపించాడని ట్రయల్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించగా, హైకోర్టు దాన్ని రెండేళ్లకు తగ్గించింది. పోస్టుమార్టం విధానంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ విచారణలో లోపాలను ప్రస్తావించింది.










