Roja Latest News | ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా. హైదరాబాద్ లో తన ఆస్తులను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ భవిష్యత్ ను తాకట్టు పెట్టేశారని మండిపడ్డారు. మంగళవారం నెల్లూరు జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను రోజా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కూటమి సర్కారు కక్ష సాధింపులు చేస్తుందని ఆరోపించారు. కూటమి నేతల అక్రమాలు, అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని నేపాల్ లో లాగా ప్రజలు కూటమి నేతల్ని తరిమికొట్టే సమయం తొందర్లోనే ఉందన్నారు.
రాయలసీమకు ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచిన విషయాన్ని ఓటుకు నోటు కేసులో దొంగ, చంద్రబాబు పార్ట్నర్ అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే తాను సీమలోనే పుట్టానని, సీమంటే తనకు ఇష్టమని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు అని ఆమె ప్రశ్నించారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకుండా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారని విమర్శలు గుప్పించారు.









