Omar Abdullah’s Divorce Plea | జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరియు ఆయన భార్య పాయల్ అబ్దుల్లా మధ్య విడాకుల పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఒమర్ అబ్దుల్లా తన భార్యతో విడాకులు కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా, జస్టిస్ సుధాన్షు ధులియా మరియు జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం, ఇరు పక్షాలు కలిసి కూర్చుని తమ వైవాహిక వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని సూచించింది.
ఈ కేసులో కౌన్సిలింగ్ ప్రక్రియ విఫలమయ్యింది. కానీ దంపతులకు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాం. భార్యాభర్తలు కూర్చుని తమ మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించుకుని వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. మూడు వారాల్లోగా ఈ ప్రక్రియ పూర్తవ్వాలి అని సుప్రీం పేర్కొంది.
తదుపరి విచారణను మే7కు వాయిదా వేసింది. ఒమర్ అబ్దుల్లాకు పాయల్ కు 1994లో వివాహం జరిగింది. అయితే గత కొన్నేళ్లుగా వీరు విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో భార్య నుండి విడాకులు ఇప్పించాలని ఒమర్ అబ్దుల్లా 2016లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.
కానీ కోర్టు ఒమర్ పిటిషన్ ను తిరస్కరించింది. దింతో ఆయన ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా నిరాశే ఎదురవడంతో సీఎం ఒమర్ అబ్దుల్లా సుప్రీం కోర్టు మెట్లెక్కారు.