Covid 19 Vaccine | కొంత కాలంగా దేశవ్యాప్తంగా ఆకస్మిక గుండెపోటు మరణాలు (Cardiac Arrest) సంభవిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా 20 ఏళ్లలోపు యువత కూడా గుండెపోటుకు గురవుతున్నారు.
ఈ హార్ట్ ఎటాక్ లకు కోవిడ్ 19 వ్యాక్సిన్ కారణం కావొచ్చేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ 19 వ్యాక్సిన్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆకస్మిక గుండెపోటు మరణాలకు కోవిడ్ 19 వ్యాక్సిన్ కారణం కాదని స్పష్టం చేసింది.
ఈ విషయంపై ఇప్పటికే రెండుసార్లు రీసెర్చ్ నిర్వహించినట్లు తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు ఎయిమ్స్ సంయుక్తంగా నిర్వహించిన రీసెర్చ్ లో కోవిడ్ వ్యాక్సిన్లకు కోవిడ్ 19 తర్వాత ఆకస్మిక మరణాలకు ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించినట్లు స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
ప్రస్తుత ఆధునిక జీవన శైలి, జెనెటిక్స్, పలు అనారోగ్య సమస్యలే ఆకస్మిక మరణాలకు కారణమవుతున్నట్లు పరిశోధనల్లో తేలిందని పేర్కొంది. వ్యాక్సిన్ ల వల్ల చిన్న చిన్న దుష్ప్రభావాలు ఉండొచ్చు కానీ పెద్ద అనారోగ్య సమస్యలు రావని స్పష్టం చేసింది.









