Nepal Gen-Z Protest News | నేపాల్ దేశంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమను తాము జెన్-జి లుగా పిలుచుకుంటున్న నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం బాట పట్టారు.
1997-2012 మధ్య కాలంలో జన్మించిన వారిని జెనరేషన్ జి అని పిలుస్తారు. అయితే ఇటీవల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల వారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే నేపాల్ 26 విదేశీ సోషల్ మీడియా యాపులపై నిషేధం విధించింది.
ఈ చర్య యువతలో తీవ్ర ఆగ్రహానికి కారణం అయ్యింది. నేపాల్ ప్రభుత్వ అవినీతి, అస్థిరత గురించి సోషల్ మీడియా వేదికగా తమ గళాన్ని అనగదొక్కాలనే కుట్రలో భాగంగా ప్రభుత్వం సోషల్ మీడియా యాపులపై నిషేధం విధించిందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.
కాగా వీరి ఆందోళన సోమవారం తీవ్ర రూపం దాల్చింది. సోమవారం ఉదయం కఠ్మాండూలోని సింహ్ దర్బార్ దగ్గరకు వేలాది మంది నిరసనకారులు చేరుకున్నారు. అక్కడి నుంచి న్యూ బనేశ్వర్‌లోని పార్లమెంట్ భవనం వైపు ప్రదర్శనగా వెళ్లారు. కొంతమంది నిరసనకారులు బారికేడ్లను దాటి పార్లమెంట్ భవన సముదాయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని, ఈ సమయంలో ఘర్షణలు చెలరేగడంతో బలగాలు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించింది.
ఈ నేపథ్యంలో సుమారు 13 మంది పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రపతి భవన్, శీతల్ నివాస్, నారాయణ్ దర్బార్ మ్యూజియం, ప్రధాన మంత్రి నివాసం పార్లమెంట్ హౌస్ చుట్టూ రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది.
నిరసనకారులు, నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా 2008లో నేపాల్ లో రాచరిక పాలన ముగిసి ఫెడరల్ డెమోక్రాటిక్ రిపబ్లిక్‌గా మారింది. అప్పటి నుంచి నుంచి రాజకీయ అస్థిరత నెలకొని ఉంది. గత 17 సంవత్సరాలలో 13 ప్రభుత్వాలు మారడం గమనార్హం.









