Minister Ponnam Prabhakar News | తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ ను గతంలో బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని పేర్కొన్నారు. హుస్నాబాద్ కరీంనగర్ జిల్లాలో ఉండాలనేది ప్రజల ఆకాంక్ష అని వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతామని ప్రకటించారని తెలిపారు.
స్థానిక శాసనసభ్యుడిగా ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, శాస్త్రీయ పద్దతిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలపడం తథ్యం అని స్పష్టం చేశారు మంత్రి పొన్నం.








