- తెలంగాణ భవన్ లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR Comments | హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో (Telangana Bhavan) బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (KCR) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు పాల్గొని భావోద్వేగభరితంగా, ఘాటుగా ప్రసంగించారు.
తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశలో ఉన్న క్లిష్ట పరిస్థితులను గుర్తుచేసిన ఆయన, అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ వంటి బలమైన రాజకీయ శక్తులను ఎదుర్కొంటూ కేసీఆర్ ఉద్యమాన్ని నడిపారని అన్నారు.
మీడియా బలం, ధన బలం, అధికార బలం ఏదీ లేకపోయినా తెలంగాణకు న్యాయం చేయాలనే సంకల్పమే ఆయనకు ఆయుధమని పేర్కొన్నారు. 14 ఏళ్ల దీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ సాధ్యమైందన్నారు.
పదేళ్ల పాలనలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారని, ఉత్తమ ఉద్యమకారుడు, ఉత్తమ పరిపాలకుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో కొందరు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాణి రుద్రమదేవి, కొమురం భీమ్, సమ్మక్క–సారలమ్మ, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న వంటి వీరుల వారసత్వమే తెలంగాణ జాతి అని స్పష్టం చేశారు. “తెలంగాణలో రెండు జాతులే—తెలంగాణ వాదులు, తెలంగాణ ద్రోహులు” అని వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌ను ప్రజలే జాతిపితగా గౌరవిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రమే ఆయన ఆనవాళ్లు అని పేర్కొన్నారు. మళ్లీ గులాబీ జెండా ఎగరేయడమే ఆయనకు పుట్టినరోజు కానుక అని, ఐకమత్యంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.










