Kavitha Comments | తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) శనివారం మెదక్ జిల్లాలో పర్యటించారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, పలువురు ముఖ్యనేతలను ఉద్దేశించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆరెస్ కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఉందని, అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోయిందని విమర్శించారు.
మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా మానేసి ప్రజల్లోకి రావాలని సూచించారు. బీఆర్ఎస్ కేడర్ వేలమంది తమతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు జగదీశ్‌రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు గతంలో ఎలా ఉండేవారని.. ఇప్పుడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నేతలు ఆస్తులు పెంచుకున్నారని… కానీ కేడర్‌ను మాత్రం పెంచుకోలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితోనే తాము ప్రజల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. పలువురు బీఆర్ఎస్ నేతలు చేసిన అరాచకాల వల్లే గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిందన్నారు కవిత.
వారంతా కేసీఆర్‌ను తప్పుదోవ పట్టించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. . తెలంగాణలో జాగృతి ప్రశ్నించే శక్తిగా పనిచేస్తోందన్నారు. తామే ప్రధాన ప్రతిపక్షంగా మారుతామని చెప్పారు.









