ISRO Launches EOS-08 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)) భూ పరిశీలన ఉపగ్రహ (Earth Observation Satellite) ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-8 (EOS-08)ను ఉపగ్రహ వాహన నౌక ఎఎస్ఎస్ఎల్వీ-డీ3 (SSLV-D3) ద్వారా శుక్రవారం ఉదయం ప్రయోగించారు.
ఉదయం 9.17 గంటలకు బయలుదేరిన రాకెట్.. 17 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెటినట్టు ఇస్రో ప్రకటించింది.
ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహం తీసిన ఫోటోలను విశ్లేషించి, వాతావరణం, విపత్తులపై అధ్యయనం చేస్తారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు సేవలను అందజేయనుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది.