Hyderabad Police Intensifies Crackdown on Chinese Manja Telangana | సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలను అరికట్టేందుకు విస్తృత చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్. నగర కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పెద్ద ఎత్తున చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరవ్యాప్తంగా అన్ని జోన్లలో నిర్వహించిన దాడులలో ఇప్పటివరకు మొత్తం 103 కేసులు నమోదు కాగా, 143 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
వీరి నుంచి రూ. 1.24 కోట్ల విలువైన 6,226 మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చైనీస్ మాంజాపై తనిఖీలు ముమ్మరం చేయడంతో వ్యాపారులు ఆన్‌లైన్ బాట పట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వేదికగా సాగే క్రయవిక్రయాలపై 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఉంచినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో నిషేధిత మాంజా కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని సజ్జనర్ వార్నింగ్ ఇచ్చారు.










