Harish Rao News Latest | కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయమని పేర్కొన్నారు మాజీ మంత్రి, బీఆరెస్ సీనియర్ నాయకులు హరీష్ రావు.
విష జ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్ తో విద్యార్థులు ఆస్పత్రుల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించిందని విమర్శించారు. గురుకులాల్లో పనిచేస్తున్న 2500 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వని దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.
ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదు ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తానే ఇకనుండి గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో గురుకుల విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిస్తే రేవంత్ రెడ్డి పాలనలో నరక కూపాలుగా మారాయని ఆరోపించారు. గురుకులాలంటే ఎందుకు మీకు అంత చిన్న చూపు అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు.









