Harish Rao News | ఒకవైపు యూరియా కొరతతో రాష్ట్ర రైతాంగం అల్లకల్లోలం అవుతుంటే అధికార పక్షం దాన్ని ప్రతిపక్షాల దుష్పచారంగా చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీరు దొంగే.. దొంగ దొంగ అన్నట్లుందన్నారు. కుండపోత వానలో తడుస్తూ రైతులు గంటల కొద్దీ నిలబడటం అబద్దమా? అని నిలదీశారు. ఆధార్ కార్డులు, పాస్ బుక్కులు, చెప్పులు క్యూలైన్లలో పెట్టడం అబద్దమా?, యూరియా బస్తాలు ఇవ్వాలంటూ రైతన్నలు అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకున్నది అబద్దమా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎంపీల యూరియా పోరాటం ఫలించిందని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గనిపిస్తలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం వల్లనే ఈరోజు రైతులకు ఇన్ని కష్టాలు వచ్చాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకపోవడం వల్లనే రైతులు కన్నీళ్లు పెట్టాల్సి వస్తుందని హరీష్ ఫైర్ అయ్యారు.
ఇప్పటికైనా ప్రతిపక్షాల మీద నిందలు మాని, రైతుల యూరియా కష్టాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రికి ఈ బీఆరెస్ నేత సూచించారు. యూరియా, ఎరువుల కొరత పై సమీక్ష నిర్వహించి, రైతాంగానికి అవసరమైన యూరియా వెంటనే సరఫరా చేయాలని హరీష్ డిమాండ్ చేశారు.









