GST 2.0 News Latest | జీఎస్టీ స్లాబుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జీఎస్టీలో 5% మరియు 18% స్లాబులను మాత్రమే కొనసాగించనున్నారు.
12, 28 శాతం స్లాబులను తొలగించారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో నిర్ణయించారు. లగ్జరీ వస్తువులపై మాత్రం 40 శాతం జీఎస్టీ వర్తించనుంది. కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించి జీఎస్టీ 2.0 వివరాలను వెల్లడించారు.
కొత్త స్లాబులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జీఎస్టీ 2.0 సంస్కరణలను ప్రకటించారు, ఇవి దీపావళి నాటికి అమలులోకి వస్తాయని పేర్కొన్న విషయం తెల్సిందే.
జీఎస్టీ వ్యవస్థను సరళీకరించడం, సామాన్య ప్రజలకు పన్ను భారాన్ని తగ్గించడానికి స్లాబ్ రేట్లను తగ్గించడం మరియు టెక్నాలజీ ఆధారిత రిజిస్ట్రేషన్, రిటర్న్ ఫైలింగ్, మరియు రీఫండ్ ప్రక్రియలను సులభతరం చేయడం జీఎస్టీ 2.0 ఉద్దేశ్యం అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
అవసరమైన వస్తువులు మరియు సేవలపై జీఎస్టీ విధించబడదని ఆమె తెలిపారు. తాజా పండ్లు, కూరగాయలు, బ్రాండ్ లేని ఆహార ధాన్యాలు, పాలు, మాంసం, గుడ్లు, విద్యా సేవలు, ఆరోగ్య సేవలు అలాగే పాలు, పనీర్, అన్ని రకాల భారతీయ రొట్టెలపై జీఎస్టీ సున్నా శాతంగా ఉండనుంది.
అలాగే ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు, మందులు, వైద్య పరికరాలు, హెయిర్ ఆయిల్, టాయిలెట్ సోప్, సోప్ బార్లు, షాంపూలు, టూత్‌బ్రష్‌లు, టూత్‌పేస్ట్, సైకిళ్లు, టేబుల్‌వేర్, కిచెన్‌వేర్, ఇతర గృహ వస్తువులపై ఐదు శాతం జీఎస్టీ వర్తించనుంది.
మొబైల్ ఫోన్‌లు, కంప్యూటర్లు, సీవింగ్ మిషన్లు, ప్రెషర్ కుక్కర్లు, గీజర్లు, వాక్యూమ్ క్లీనర్లు వంటి వాటిపై 18 శాతం జీఎస్టీ ఉండనుంది. టొబాకో, బీడీ, సిగరెట్లు, హై-ఎండ్ కార్లు, లిక్కర్ వంటి లగ్జరీ వస్తువులపై 40 శాతం జీఎస్టీ వర్తించనుంది.









