Sunday 27th April 2025
12:07:03 PM
Home > తెలంగాణ > నేటినుంచి తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్‌

నేటినుంచి తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్‌

Free bus for Telangana women from today

హైదరాబాద్‌ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్‌ రెడ్డి దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇది కూడా ఒకటి. ఈనెల 9 నుంచి ఈ గ్యారెంటీ అమలులోకి వస్తుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈమేరకు మంత్రి వర్గంలో నిర్ణయం కూడా తీసుకున్నారు. మొత్తం ఆరు గ్యారెంటీలను వందరోజుల్లోపు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ముందుగా రెండు గ్యారెంటీలను అమలులోకి తెస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు ఇందులో ఒకటి కాగా, మహిళల ఉచిత ప్రయాణం మరో ప్రధాన గ్యారెంటీ. తెలంగాణ కంటే ముందు కర్నాటకలో కూడా ఇలాంటి గ్యారెంటీలను ప్రకటించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అక్కడ కూడా మహిళల ఉచిత ప్రయాణం అనే పథకాన్ని అమలులోకి తెచ్చింది కాంగ్రెస్‌. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా.. తర్వాత అంతా సర్దుకుపోయింది. కర్నాటక ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. కర్నాటకలో మొత్తం 22 వేల పైచిలుకు బస్సులున్నాయి. ఇందులో ఆర్డినరీ, ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం ఉంది. ఈ పథకం అమలులోకి రాకముందు కర్నాటక బస్సుల్లో సగటున పురుషులు 60శాతం మంది ప్రయాణిస్తుండగా, మహిళలు 40శాతం మంది ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణ పథకం అమలులోకి వచ్చాక ఈ నిష్పత్తిలో మార్పు వచ్చింది. మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం అక్కడి బస్సుల్లో మహిళలు 55శాతం మంది ప్రయాణిస్తుండగా, పురుషుల సంఖ్య సహజంగానే 45కి పడిపోయింది. మహిళలే ఎక్కువగా బస్సులు ఎక్కుతున్నారు. కర్నాటకకు చెందిన స్థానిక మహిళలకే ఆ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశముంది. కర్నాటక రాష్ట్రంలో తిరిగే బస్సుల్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంది. అంతర్‌ రాష్ట్ర సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లేదు. తెలంగాణలో ఈ పథకం నేటి నుంచి అమలులోకి వస్తుంది. కేబినెట్‌ విూటింగ్‌ తర్వాత మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఈ పథకంపై వివరాలు తెలియజేశారు. ఈనెల 9 నుంచి మహిళలు తమ గుర్తింపు కార్డు చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్పారు. ఆధార్‌ కార్డు లేదా ఇతర కార్డులు చూపించి మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశముంది. దీనిపై కాసేపట్లో విధవిధానాలు ఖరారు కానున్నాయి. ముఖ్యంగా ఈ పథకం ఆ రాష్ట్రంలోని మహిళలను ఉద్దేశించి ప్రవేశపెట్టింది. అందుకే స్థానికత చూసేందుకు గుర్తింపు కార్డులు అడుగుతున్నారని తెలుస్తోంది. ఇతర రాష్టాల్ర గుర్తింపు కార్డులు ఉన్నవారికి తెలంగాణ రాష్ట్ర సర్వీసుల్లో ప్రయాణించే అవకాశం ఉండదని అంటున్నారు. ప్రస్తుతానికి నిబంధనల గురించి ఆర్టీసీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఆర్టీసీ పూర్తి వివరాలు, నియమనిబంధనలు బయటపెడితే ఈ పథకంపై అందరికీ అవగాహన వచ్చే అవకాశముంది. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటే.. వెంటనే దాని ప్రభావం ఆర్టీసీతోపాటు ఆటోవాలాలపై కూడా పడుతుంది. ఇప్పటి వరకు ఆటోలు ఎక్కి ప్రయాణించినవారంతా.. ఆర్టీసీ బస్సుకోసం వేచి చూస్తారు. కాస్త ఆలస్యమైనా ఆర్టీసీ ప్రయాణాన్నే కోరుకుంటారు. అంటే పరోక్షంగా ఆటోవాలాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కర్నాటకలో కూడా ఈ సమస్య ప్రారంభమైంది. అయితే మహిళల స్థానంలో పురుషులు ఎక్కువగా ఆటోలు ఎక్కడం వల్ల ఆ నష్టం కాస్త భర్తీ అయింది. తెలంగాణలో కూడా ఇలాంటి సమస్య ఇప్పుడు తెరపైకి వస్తుంది. దీనికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటి వరకు మహిళలు టికెట్‌ కొని ప్రయాణించేవారు, ఇకపై వారు టికెట్లు కొనరు. మహిళలు ఎక్కువమంది బస్సులో నిండిపోతే.. పురుషులకు స్థానం ఉండదు. అంటే మహిళల ప్రయాణాలు పెరుగుతాయి, ఆటోమేటిక్‌ గా పురుషుల టికెట్లు తగ్గిపోతాయి. ఈమేర ఆర్టీసీకి నష్టం వస్తుంది. దీన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నెలనెలా ఈ ఖర్చులను భరిస్తూ ఆర్టీసీకి సాయం చేస్తే పథకం సాఫీగా అమలవుతుంది. ఎక్కడ తేడా వచ్చినా ఈ పథకం అభాసుపాలవుతుంది.

You may also like
‘లారీతో ఢీ కొట్టి వేట కొడవళ్ళతో..ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య’
‘పహల్గాం ఉగ్రదాడి..NIA చేతికి కీలక ఆధారం’
‘ప్రతీ భారతీయుడి రక్తం మరుగుతోంది’
‘బీఆరెస్ రజతోత్సవం..కేసీఆర్ కోసం వెండి శాలువా’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions