Factors that led to BRS loss | సరిగ్గా ఐదేండ్ల కిందట.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో అఖండ విజయం సాధించింది బీఆర్ఎస్. అప్పుడు కూటమిగా వచ్చిన పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించింది. కాలం గిర్రున తిరిగింది. మొన్నటి ఎన్నికల్లో 64 సీట్లలో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నది.
మరి ఈ ఐదేండ్లలో ఏం మారింది? బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణమేంటి? ఊసులోనే లేని కాంగ్రెస్ రేసులోకి ఎలా వచ్చింది? కేసీఆర్ స్వీయ తప్పిదాలే కారణమా? లేక పార్టీపై వ్యతిరేకతే ముంచిందా? తెలంగాణ ఎన్నికలు, ఫలితాలపై స్పెషల్ స్టోరీ..!
ఆరు నెలలకే మొదలైన వ్యతిరేకత!
2018 తెలంగాణ ఎన్నికల్లో గెలిచామన్న సంతోషం బీఆర్ఎస్‌కు ఎక్కువ కాలం నిలవలేదు. ఆరు నెలల్లో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బే తగిలింది. ‘సారు కారు పదహారు’ అంటూ చేసిన ప్రచారం ఫలించలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే సీటుకు పరిమితమైన బీజేపీ.. ఆశ్చర్యకరంగా నాలుగు సీట్లు సాధించింది. కాంగ్రెస్‌కు మూడు వచ్చాయి. దీంతో 9 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితమైంది. అప్పటి నుంచి వరుస వివాదాలు బీఆర్ఎస్‌ను చుట్టుముడుతూనే ఉన్నాయి. గ్లోబరీనా సంస్థ నిర్వాకంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పెను దుమారం రేపింది.
ఈ విషయంలో సర్కారు స్పందించిన తీరు విమర్శలకు దారి తీసింది. తర్వాత జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా బీఆర్ఎస్‌ను డ్యామేజీ చేసింది. చివరికి ప్రభుత్వం మెట్లు దిగి వచ్చినా.. భారీ వ్యతిరేకతను మాత్రం మూటగట్టుకుంది. ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. ఇదే సమయంలో బీజేపీ బలోపేతమైంది. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే స్థాయికి గ్రాఫ్‌ను పెంచుకుంది.
చిచ్చు రేపిన ఈటల రాజేందర్
ఉద్యమ సమయంలో అందరినీ వాడుకుని వదిలేశారన్న అపవాదును కేసీఆర్ మూటగట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకున్నారని, మంత్రి పదవులు కూడా ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ ఫస్ట్ టర్మ్ లో ఇవేమీ కేసీఆర్ ఎదుట నిలవలేకపోయాయి. తొలి టర్మ్ లో పెద్దగా వ్యతిరేకత లేకపోవడం, రైతు బంధు ప్రకటన సూపర్ సక్సెస్ కావడంతో 2018 ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించారు.
కానీ ఆ ఐదేండ్ల కాలంలో ఎంతో మంది కేసీఆర్‌కు దూరం జరిగారు. అయితే 2021 మే నెలలో ఈటల రాజేందర్ ఎపిసోడ్.. బీఆర్ఎస్‌ను కుదుపు కుదిపింది. హైకమాండ్‌పై అసమ్మతి రేపిన ఈటలను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో భూకబ్జా ఆరోపణలు చేసి ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారు.
ఈ క్రమంలో పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు ఈటల. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని నిలువరించి మరీ విజయం సాధించారు. ఈ ఉప ఎన్నిక సమయంలోనే అతి భారీ పథకం దళితబంధును ప్రకటించారు.
2018 ఎన్నికలకు ముందు రైతు బంధును ప్రకటించి సక్సెస్ అయిన కేసీఆర్.. ఓ ఉప ఎన్నిక కోసం దళిత బంధును ప్రయోగించారు. కానీ ఓటర్లు మాత్రం ఈటల వైపే నిలబడ్డారు. ఇటు పథకం ప్రకటన వృథాగా పోయింది. తర్వాత మెల్లగా స్కీమ్ అమలు అటకెక్కింది.
పేపర్ల లీక్ దుమారం..(Factors that led to BRS loss)
బీఆర్ఎస్ ఓటమిలో నిరుద్యోగులది కీలక పాత్ర. నిరుద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రూప్స్ నియామక నోటిఫికేషన్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. పోలీసు నియామకాలు మినహా మిగతా వేటిపైనా పెద్దగా దృష్టిపెట్టలేదు. నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ఉద్యోగాల ప్రకటనపై గత ఏడాది ప్రకటన చేసింది.
కానీ నోటిఫికేషన్ల రిలీజ్, ఉద్యోగాల భర్తీ విషయంలో అలసత్వం చూపింది. పైగా అప్లికేషన్ల రూపంలోనే అభ్యర్థుల నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేసింది. కానీ పరీక్షల నిర్వహణలో మాత్రం చేతులెత్తేసింది. అంతులేని అలసత్వం ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో పేపర్లు లీక్ కావడం, వరుసగా పరీక్షలు రద్దు కావడం బీఆర్ఎస్‌పై వ్యతిరేకతను మరింత పెంచింది.
ఈ వ్యవహారంపై మంత్రులు సహా బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రకటనలు అగ్నికి ఆజ్యంపోశాయి. పేపర్ల లీక్ జరిగిన కొత్తలో.. కేవలం ఇద్దరి పని అంటూ తేలికగా మాట్లాడారు నాటి మంత్రి కేటీఆర్. తనకేం సంబంధమంటా తర్వాత అన్నారు. పెద్ద సమస్య కాదని వాళ్లు భావించి ఉండొచ్చు. అత్యంత వ్యతిరేకతను తెచ్చుపెడుతుందని తర్వాత అర్థమైంది.
దీంతో నష్టనివారణ చర్యలకు కేటీఆర్ దిగారు. ఇటీవల కొందరు నిరుద్యోగులతో ముచ్చట్లు పెట్టారు. పేపర్ల లీక్‌కు సారీ కూడా చెప్పారు. అసలు పేపర్ లీక్‌ను తామే గుర్తించామని ఏదో ఘనకార్యం చేసినట్లు చెప్పుకున్నారు. అశోక్‌నగర్‌కు వచ్చి మాట్లాడుతానంటూ చెప్పుకొచ్చారు.
నిరుద్యోగ భృతి ఇవ్వాలని అనుకున్నామని, ఇవ్వలేకపోయామనీ ఒప్పుకున్నారు. ప్రజలను సీఎం కలవాల్సిన అవసరం ఏముందన్న ఆయన.. సీఎంను ప్రజలు కలవాలనుకుంటే ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తామని అదే రోజున చెప్పారు.
ఎన్నిచెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం. అంతా బాగున్నప్పుడు పట్టించుకోకుండా.. ఎన్నికల ముందు వచ్చి క్షమాపణలు చెబితే చేసిన తప్పులు ఒప్పులవుతాయా.
బీఆర్‌ఎస్‌ను ముంచేసిన పిల్లర్లు..
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్రంలో మొదటి నుంచీ తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇంత భారీ ఎత్తిపోతల పథకం వల్ల నష్టమే ఎక్కువని మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లు మొత్తుకున్నారు. కానీ రీడిజైన్ చేసి నిర్మించిన ఈ ప్రాజెక్టులో లోపాలు తరచూ బయటపడుతూనే ఉన్నాయి. కానీ అలాంటిదేమీ లేదంటూ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది.
పైగా ఆ ప్రాజెక్టు ఇంజనీరింగ్ మార్వెల్ అని, ఆహా ఓహో అని గొప్పలు చెప్పుకుంది. ఏకంగా డిస్కవరీ చానల్‌లో లిఫ్టింగ్ ఎ రివర్ పేరుతో పెయిడ్ వీడియో వేయించుకుందని ఆరోపణలు వచ్చాయి. తీరా ఏడాదిన్నర కింద కన్నెపల్లి పంప్‌హౌస్‌ల మునకతో ప్రాజెక్టు నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటన పెను దుమారమే రేపింది.
నాలుగేళ్ల కిందట ప్రారంభించిన ప్రాజెక్టు పిల్లర్లు కుంగడమేంటనే ప్రశ్నలకు సరైన సమాధానమే లేదు. ఇప్పుడు అన్నారం బ్యారేజీలోనే బుంగలు పడ్డాయి. మేడిగడ్డను పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ.. సంచలన రిపోర్టు ఇచ్చింది.
ఏడో బ్లాక్‌లోని అన్ని పిల్లర్లను పునాదులతో పాటు తొలగించాలని, కొత్తగా మళ్లీ నిర్మించాలని స్పష్టం చేసింది. ఒకవేళ మిగతా బ్లాకుల్లోనూ నిర్మాణాలు దెబ్బతిని ఉంటే మొత్తం బ్యారేజీని తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉంటుందంటూ బాంబులాంటి ప్రకటన చేసింది. ఇప్పటికే ఉన్న తీవ్ర వ్యతిరేకతకు తోడు బీఆర్ఎస్‌పై మేడిగడ్డ వ్యవహారం పిడుగులా పడింది.
బీజేపీతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు..
ఏడాదిన్నర కిందటి వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమితులైన తర్వాత రాష్ట్ర బీజేపీ రూపురేఖలే మారిపోయాయి. జీహెచ్‌ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలతో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే స్థాయికి వచ్చింది.
కానీ ఐదు నెలల ముందు బీజేపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం మొత్తం పార్టీ పరిస్థితినే తలకిందులు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ డిప్యూటీ సీఎంనే అరెస్టు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు.. ఎమ్మెల్సీ కవిత విషయంలో మాత్రం చర్యలు తీసుకోకపోవడం, అగ్రెసివ్ మోడ్‌లో పార్టీని బలోపేతం చేసిన బండి సంజయ్‌ని తప్పించడంతో ఓ ప్రచారం మొదలైంది.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయనే చర్చకు తెరలేచింది. మరోవైపు కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ టార్గెట్‌గానే విమర్శలు చేయడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూర్చినట్లు అయింది. ఒకవేళ హంగ్ వస్తే బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోతాయని కాంగ్రెస్ బలంగా ప్రచారం చేసింది.
బీజేపీ, ఎంఐఎం మధ్య అనధికార, రహస్య పొత్తు ఉందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరోవైపు గతంలో పార్లమెంటులో బీజేపీ అవసరమైన సమయంలో బీఆర్ఎస్ అండగా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. బండి సంజయ్‌ని తొలగించడానికి కొన్ని వారాల ముందు ఢిల్లీలో కేసీఆర్ పర్యటించిన తర్వాత.. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు మొదలయ్యాయి. ఈ మార్పులు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారాయి.
ధరణి లోపాలు..
ధరణి పోర్టల్‌తో ఉపయోగాలెన్నో నష్టాలు కూడా అన్నే ఎదురయ్యాయి. మధ్యవర్తులు లేకుండా, వీఆర్‌వో వ్యవస్థ లేకుండా నేరుగా భూముల క్రయ విక్రయాలు చేయొచ్చని, రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చని సర్కారు చెప్పింది. ఎవరి దగ్గరికీ వెళ్లాల్సిన అవసరం లేదని, అన్ని సమస్యలకూ ఆన్‌లైన్‌లోనే పరిష్కారం దొరుకుతుందని చెప్పింది.
కానీ కొన్ని సమస్యల విషయంలో ఎవరి దగ్గరికి వెళ్లాలో అర్థం కాక.. మీ సేవా సెంటర్లు, ఎమ్మార్వో ఆఫీసులు, కలెక్టర్లు చుట్టూ ఎంతో మంది చెప్పులు అరిగేలా తిరిగారు. అసైన్డ్ భూములు, స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చిన భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి.
కొన్ని చోట్ల సర్వే నెంబర్లలో భూముల వివరాలు గల్లంతయ్యాయి. ఇలాటి సమస్యలకు పరిష్కారం లభించక ఇక్కట్లు పడిన వాళ్లు ఎందరో.. ఇదే సమయంలో వ్యవస్థ సులభతరమైందని, పనులు త్వరగా అయిపోయాని భావించిన వాళ్లూ ఉన్నారు. కానీ ధరణిపై వ్యతిరేకత ప్రజల్లో పెరిగిపోయింది. ఇదే సమయంలో ధరణి ఆహా ఓహో అంటూ కేసీఆర్ పదే పదే చెప్పడం ఆ వ్యతిరేకతను మరింత పెంచింది.
ఎమ్మెల్యేలపై వ్యతిరేకత.. (Factors that led to BRS loss)
రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. తమ ఎమ్మెల్యేల అవినీతిని ఏకంగా కేసీఆరే ఒప్పుకున్నారు. దళితబంధులో కమీషన్లు తీసుకుంటున్నారని ఆయనే స్వయంగా చెప్పారు. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
కొందరిపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. కానీ వీటిని కేసీఆర్ పట్టించుకోలేదు. అభ్యర్థులను ప్రకటించిన సమయంలో.. దాదాపు 95 శాతం సిట్టింగ్‌లకే అవకాశం ఇచ్చారు. అంటే అవినీతి చేసిన ఎమ్మెల్యేలకు పరోక్షంగా కేసీఆర్ సపోర్ట్ ఇచ్చారు. నిజానికి కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ వెనుకడుగు వేశారు. అదీకాక ఒక్కో నియోజవకర్గంలో ఇద్దరు ముగ్గురు ఆశావహులు పార్టీలో ఉన్నారు.
గతంలో ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లందరినీ చేర్చుకున్నారు. దీంతో పోటీ పడే వారి సంఖ్య పెరిగిపోయింది. ఈ క్రమంలో కొత్త వారికి అవకాశం ఇస్తే.. సిట్టింగులు రెబల్స్‌గా మారే ప్రమాదం ఉందని కేసీఆర్ భావించారు. పైగా అవినీతి చేసినందుకే సిట్టింగులను దూరం పెట్టారని ప్రతిపక్షాలు చేస్తాయని అనుకున్నారు. ఈ క్రమంలో సిట్టింగులకే సీట్లిచ్చి.. తన ఓటమికి తానే తాంబూళం ఇచ్చుకున్నారు.
బలపడిన కాంగ్రెస్…
ఏడు నెలల కిందట జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఊపిరిపోశాయి. అక్కడి విజయంతో పార్టీ మళ్లీ రేసులోకొచ్చింది. దీంతో తెలంగాణలో కూడా ఒక్కసారిగా హైప్ పెరిగింది. తొమ్మిదేండ్లుగా నేతలు వెళ్లిపోవడం మాత్రమే చూసిన పార్టీ.. కొత్తగా నేతల చేరికలతో బిజీగా మారిపోయింది.
బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్తులు ఒకరి తర్వాత ఒకరు చేరడంతో బలోపేతమైంది. ఏడాదిలోనే జీరో నుంచి హీరో స్థాయికి కాంగ్రెస్ ఎదిగింది. పైగా కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో కూడా జనంలోకి బాగా వెళ్లింది. ఆరు గ్యారంటీల పేరుతో ప్రచారం చేసి.. గ్రామీణ ఓట్లను బాగానే రాబట్టింది.
ఇది కేసీఆర్ ఓటమి మాత్రమే…
కాలం కలిసిరాకపోతే.. అరటిపండు తిన్నా పన్ను విరుగుతుందట. బీఆర్ఎస్ పరిస్థితీ ఇదే. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ వరుస వివాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎన్నికల ఏడాదిలో అవి మరింతగా ముదిరాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు.. పేపర్ల లీకేజీ, ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత బీజేపీతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు దెబ్బతీశాయి.
పథకాల అమలు విషయంలో ప్రజాప్రతినిధుల జోక్యం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, ఆరోగ్యశ్రీని సమర్థంగా అమలు చేయకపోవడం, డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయకపోవడం, కరోనా సమయంలో ఆరోగ్య వ్యవస్థను పెద్దగా పట్టించుకోకపోవడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కామారెడ్డిలో పోటీ చేయాలని కేసీఆర్ భావించడం అతిపెద్ద తప్పు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రావచ్చు గాక.. ఇది కేసీఆర్ ఓటమి మాత్రమే. కాంగ్రెస్ గెలుపు కాదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 92,35,792 (39.4). ఇదే సమయంలో బీఆర్ఎస్ పడిన ఓట్లు 87,53,924 (37.35). అంటే రెండు పార్టీల మధ్య ఓట్లే తేడా 4,81,868 (2.05) మాత్రమే. ఇది కాంగ్రెస్ వేవ్ కాదు. 39 సీట్లు గెలిచిన బీఆర్ఎస్.. కొన్ని సీట్లలో తక్కువ మార్జిన్‌తో ఓడిపోయింది. కాంగ్రెస్, బీజేపీ నుంచి చాలా చోట్ల కొత్త వ్యక్తులు ఎమ్మెల్యేలుగా గెలిచారు.
బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు ప్రస్తావిస్తే మాత్రం.. సీఎం ప్రజలకు అందుబాటులో లేకపోవడం, పదవీ అహంకారం, నియోజకవర్గాల్లో పలువురు ఎమ్మెల్యేల అవినీతి, స్థానిక సంస్థల్లో బీఆరెస్ లోకల్ లీడర్ల ప్రవర్తనగా పేర్కొనొచ్చు.
అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అధికారం అప్పజెప్పినప్పటికీ ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో సర్వే చేసినా అత్యధిక మంది కేసీఆరే సీఎంగా ఉండాలని కోరుకుంటారు. అదీ ఆయన చరీష్మా. దెబ్బతిన్న సింహం శ్వాస.. దాని గర్జన కన్నా భయంకరంగా ఉంటుందట!! ఓటములు కేసీఆర్‌కు తెలియనివి కావు.. ఇప్పుడు ఆయన ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారనేదే ఇక్కడ కీలకం!! అది తెలియాలంటే.. జస్ట్ వెయిట్ అండ్ సీ!