Deputy Cm Pawan Kalyan News Latest | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ మూలంగా సుమారు 30 మంది జేఈఈ పరీక్షకు హాజరవాల్సిన విద్యార్థులు విశాఖ జిల్లా పెందుర్తిలో ట్రాఫిక్ లో చిక్కుకుని పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్నారని సోమవారం కథనాలు వెలువడ్డాయి.
కేంద్రానికి ఆలస్యంగా చేరుకోవడంతో సిబ్బంది విద్యార్థుల్ని అనుమతించలేదని పవన్ పై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులు స్పందించారు.
పరీక్షల అడ్మిట్ కార్డ్ ప్రకారం, ప్రతీ అభ్యర్థి ఉదయం 07:00 గంటలకు రిపోర్ట్ చేయాలి మరియు పరీక్షా కేంద్రం యొక్క గేట్ ఉదయం 8:30 గంటలకు మూసివేయబడుతుందని, అయితే డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఉదయం 8:41 గంటలకు సదరు జంక్షన్ SE గుండా వెళ్ళిందని పేర్కొన్నారు.
కాబట్టి, ఉదయం 8:41 గంటలకు ఆ ప్రాంతం గుండా డిప్యూటీ సీఎం కదలికకూ, ఉదయం 7:00 గంటలకు రిపోర్ట్ చేయాల్సిన విద్యార్థులు ఆలస్యంగా రావడానికి ఎటువంటి సంబంధం లేదని విశాఖ సిటీ పోలీసులు స్పష్టం చేశారు.
పరీక్షార్థులు సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న పరీక్షా కేంద్రానికి స్వేచ్ఛగా వెళ్లేలా చూసేందుకు ఉదయం 08:30 గంటల వరకూ బిఆర్ టిఎస్ రోడ్డు మరియు గోపాలపట్నం – పెందుర్తి సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్ ను నిలిపివేయలేదని తెలిపారు.