CM Revanth Reddy vs KCR | శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం, బీఆరెస్ అధినేత కేసీఆర్ మధ్య ఎలాంటి వాడివేడి చర్చ జరగనుందో అని విస్తృతంగా చర్చ నడుస్తోంది. సోమవారం నుంచి రాష్ట్ర శీతాకాల శాసనసభ సమావేశాలు మొదలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన కేసీఆర్ జూబ్లీహిల్స్ నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో సోమవారం జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దాదాపు హాజరవడం ఖాయం అయ్యింది. ఇటీవల ఎర్రవల్లి ఫార్మహౌస్ లో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డికి చెందిన తమ పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తాను అసెంబ్లీ సమావేశాలకు రానున్నట్లు చెప్పారు. అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెల్దామని పేర్కొన్నట్లు సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో అసెంబ్లీలో మరియు ప్రజాక్షేత్రంలో పోరాడుతాం అని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కాస్త ఘాటుగానే బదులిచ్చారు. అసెంబ్లీకి వస్తే ఏ అంశంపై అయినా చర్చించడానికి సిద్ధం అన్నారు. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి-కేసీఆర్ మధ్య ఎలాంటి డైలాగ్ వార్ జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది.









