CM Revanth Reddy Visits Kamareddy | ఇటీవలి భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు.
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం జరిగిన చోట శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వరదల వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలను తొలగించేందుకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయనున్నట్లు చెప్పారు.
వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చిందని నష్టపోయిన వారిని ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, పోచారం ప్రాజెక్టు భారీ వరదను కూడా తట్టుకుని నిలబడి అందర్నీ కాపాడిందని పేర్కొన్నారు.
మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, పశుసంపద కోల్పోయిన వారికి సాయం అందించాలని ఆదేశించారు. కాగా కామారెడ్డి చేరుకునే సమయంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా జిల్లాలో నష్టపోయిన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు.









