Threat Call To BJP MP | మెదక్ పార్లమెంటు సభ్యులు (Medak MP), బీజేపీ నాయకులు రఘునందన్ రావు (Raghunandan Rao) కు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. పీపుల్స్ వార్ మావోయిస్టు అని తనను తాను పరిచయం చేసుకున్న ఆగంతకుడు సోమవారం సాయంత్రం లోపు చంపేస్తాం అంటూ ఎంపీని బెదిరించాడు.
ఓ వైపు వచ్చే ఏడాది మార్చి 31 వరకు మావోయిస్టులే లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో ఎంపీకి బెదిరింపులు రావడం కలకలం రేపింది. రఘునందన్ రావు సోమవారం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమానికి ఎంపీ వెళ్లారు.
ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ కాల్ ను రఘునందన్ పీఏ లిఫ్ట్ చేశారు. తాను మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టును పేర్కొన్న సదరు వ్యక్తి సోమవారం సాయంత్రం లోపు రఘునందన్ రావును చంపేస్తాం అని బెదిరించారు.
ఈ నేపథ్యంలో బెదిరింపు కాల్ పై డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీకి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఇటీవలే ఆపరేషన్ కగార్ తో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నక్సల్ ఏరివేతను చేపట్టింది. అలాగే వర్షాకాలంలోనూ మావోయిస్టులకు నిద్ర లేకుండా చేస్తామని అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు.