Ghatkesar Kidnap Case | కొంతకాలం కిందట సిద్దిపేట (Siddipet) నియోజకవర్గంలో రైతులకు నగదు రూపంలో సహాయం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు చక్రధర్ గౌడ్. ఆ తర్వాత బీజేపీ లో చేరారు.
సిద్దిపేట నుండి హరీష్ రావు పైన పోటీ చేసేది తనే అని సంచలనానికి తెర లేపారు. ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 9 కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న చక్రధర్ గౌడ్ (Chakradhar Goud) వివాదాల్లో నిలుస్తూ వస్తున్నాడు.
ఘట్కేసర్ లో యువకుడి కిడ్నాప్..
తాజాగా మేడ్చెల్ జిల్లా ఘట్కేసర్ లో ఓ యువకుడి కిడ్నాప్ కేసులో అరెస్టయ్యాడు చక్రధర్ గౌడ్. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మల్కాజిగిరి డీసీపీ జానకి సోమవారం మీడియాకు వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే ఫిర్జాది గూడ కార్పొరేషన్ పరిధి లోని బుద్దా నగర్ లో స్థిరనివాసం ఉండే అవినాష్ రెడ్డి కి, అతని ఇంటి ఎదురుగా ఉండే ఆరోషికా రెడ్డి కి 2015 లో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.
అప్పటి నుండి వారు సహజీవనం చేశారు. ఆ సమయంలో ఆరోషికా రెడ్డి తాను వ్యాపారం చెయ్యాలనుకుంటున్నానని అందుకోసం డబ్బులు కావాలని అవినాష్ ని కోరింది.
దీంతో అతను రూ. 30 లక్షలు సమకూర్చి ఆరోషికా కు ఇచ్చాడు.
ఇదిలా ఉండగా బిజినెస్ చేస్తున్న సమయం లో ఆరోషికా రెడ్డి.. (Aroshika Reddy) అవినాష్ ని కాదని తన బిసినెస్ భాగస్వామి అయిన ప్రస్తుత సిద్దిపేట నియోజక వర్గ బీజేపీ నేత చక్రధర్ గౌడ్ తో 2018 లో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంది.
దీంతో విస్తుపోయిన అవినాష్ రెడ్డి తనకు రావలిసిన రూ. 30 లక్షలు తిరిగి ఇవ్యాలని అడిగాడు.
ఇవ్వకపోతే తామిద్దరం కలిసి దిగిన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సోషమీడియా లో పెడతానని హెచ్చరించాడు. ఈ విషయాన్ని ఆరోషికా రెడ్డి తన భర్త చక్రధర్ కి వివరించింది.
డబ్బులు ఇస్తానని చెప్పి..
ఆరోషికా రెడ్డికి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చక్రధర్ గౌడ్ అవినాష్ రెడ్డికి చెప్పాడు. అందుకోసం ఘట్కేసర్ దగ్గర వందన హోటల్ వద్దకి రావాలని తెలిపాడు.
డబ్బులు వస్తాయని వెళ్లిన అవినాష్ రెడ్డి ని తన కారు లో కూర్చొని మాట్లాడుకుందామని చక్రధర్ గౌడ్ అన్నాడు. కారు లో కూర్చున్నాక ఫోటోలు, వీడియో లో డిలీట్ చెయ్యమని చక్రధర్ బెదిరించాడు.
కానీ తనకు రావాల్సిన డబ్బులు వస్తేనే వాటిని డిలీట్ చేస్తా అని అవినాష్ తెగేసి చెప్పాడు.
అయితే అప్పటికి చక్రధర్ గౌడ్ వెంట తన అనుచరులు అయిన అడిక్ మెట్ కి చెందిన మామిల్ల గౌతమ్ రాజు, మేడ్చల్ కి చెందిన నర్సింగ్ రావు, చిలకలగూడా కి చెందిన వినోద్ అప్పటికే చక్రధర్ తో అక్కడ ఉన్నారు.
అవినాష్ తో మాట్లాడుతున్న సమయం లో చక్రధర్ తన అనుచరులకు సైగ చెయ్యగా వారు అవినాష్ ని కిడ్నాప్ చెయ్యడానికి యత్నించారు.
కానీ అవినాష్ కారు లో నుండి దిగి పెద్దగా కేకలు వెయ్యడం తో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి చక్రధర్ మరియు అతని అనుచరులు అక్కడి నుండి పారిపోయారు.
వెంటనే అవినాష్ ఘట్కేసర్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా స్పందించిన పోలీసులు సిఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ లు సుధాకర్, అశోక్, శ్రీకాంత్ కేవలం గంట వ్యవధిలోనే నిందితులని పట్టుకున్నారు.
ఈ మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆమె తెలిపారు.
ఈ సమావేశంలో మల్కాజిగిరి ఏసీపీ నరేష్ రెడ్డి, సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ అశోక్, సుధాకర్ గౌడ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.