BJP Former mayor goes to mother’s house due to husband’s rebellion | మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఓ అనూహ్య ఘటన జరిగింది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా భర్త వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆవేదనకు గురైన భార్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. భర్త ఇంటిని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయారు. నాగ్పూర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. అయితే ఈ ఎన్నిక ఓ కుటుంబంలో వివాదం తీసుకువచ్చింది. నాగపూర్ మాజీ మేయర్ అర్చన దేహంకార్. ఆమె 2009 నుంచి 2012 వరకు నగర మేయర్ గా పనిచేశారు. ఆమె భర్త వినాయక్ దేహంకార్ కూడా బీజేపీ నేత. అయితే 17వ వార్డు నుంచి పోటీ చేయాలని వినాయక్ భావించారు. కానీ పార్టీ మాత్రం టికెట్ ఇవ్వలేదు. ఆయనకు బదులుగా కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో చేరిన మనోజ్ సాబ్లేకు టికెట్ దక్కింది.
ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వినాయక్ దేహంకార్ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం భార్యకు ఏ మాత్రం నచ్చలేదు. తనను మేయర్ చేసిన కాషాయ పార్టీకి వ్యతిరేకంగా భర్త నిర్ణయం తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్త పార్టీకి వెన్నుపోటు పొడవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీకి విధేయంగా ఉండడమే ముఖ్యమని నిర్ణయించుకున్నారు. దింతో భర్త ఇంటిని వీడి పుట్టింటికి వెళ్లిపోయారు. అంతేకాకుండా భర్తకు వ్యతిరేకంగా, బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది భర్త నుండి పూర్తిగా విడిపోయినట్లు కాదని, ఎన్నికల తర్వాత తిరిగి భర్త ఇంటికి వెళ్తానని ఆమె స్పష్టత ఇచ్చారు.









