Bill Gates to make his Hindi serial debut alongside Smriti Irani | మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అతి త్వరలోనే భారతీయ సీరియల్ లో కనిపించనున్నారు. కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ ప్రస్తుతం ‘క్యొంకి సాస్ భీ కభీ బహూ థీ-2’ అనే హిందీ సీరియల్ లో ప్రధానపాత్ర అయిన తులసి పాత్రలో నటిస్తున్నారు.
ఈ సీరియల్ లోనే బిల్ గేట్స్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఇంగ్లీష్ మీడియా పేర్కొంది. ఇందులో భాగంగా మూడు ఎపిసోడ్స్ లో బిల్ గేట్స్ కనిపిస్తారు. వీడియో కాల్ లో తులసి పాత్రలో స్మృతి ఇరానీ బిల్ గేట్స్ తో మాట్లాడుతారు. ఇందులో భాగంగా గర్భిణీలు, శిశువుల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, సందేహాలపై ఇరువురు మాట్లాడుకుంటారు.
అనంతరం సీరియల్ మాధ్యమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా బిల్ గేట్స్ ఇప్పటికే ఈ అంశంపై అవగాహన కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఇకపోతే రాజకీయాల్లోకి రావడానికంటే ముందు స్మృతి ఇరానీ క్యొంకి సాస్ భీ కభీ బహూ థీ సీరియల్ లో 2000 సంవత్సరం నుంచి 2008 వరకు నటించారు. అనేక అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.









