Bangladesh makes a stunning claim in the Hadi murder case | బంగ్లాదేశ్ లో ప్రస్తుతం హింసాత్మక ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇవి భారత వ్యతిరేక రూపాన్ని తీసుకున్నాయి. బంగ్లాదేశ్ నాయకుడు, ఇంక్విలాబ్ మంచ్ లో ప్రముఖ పాత్ర పోషించిన హరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళనకు దారి తీశాయి. అయితే హాదీ హత్య కేసులో నిందితులు భారత్ కు పారిపోయినట్లు బంగ్లా రాజధాని డాకా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. విద్యార్థి ఉద్యమంతో భారత అనుకూల షేక్ హసీనా ప్రభుత్వం కూలింది. ఇందులో ఉస్మాన్ బిన్ హాదీ ముఖ్య పాత్ర పోషించారు. కానీ డిసెంబర్ రెండవ వారంలో హాదీ హత్యకు గురయ్యారు.
ఈ హత్య కేసులో ప్రధాన అనుమానితులుగా ఉన్న ఫైసల్ కరీం మసూద్, అలంగీర్ షేక్ భారత్ కు పారిపోయారని బంగ్లా పోలీసులు పేర్కొన్నారు. హాదీ హత్యపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను ఆ దేశ పోలీసులు వెల్లడించారు. ఆ ఇద్దరు హలువాఘాట్ సరిహద్దు గుండా భారత్ లోని మేఘాలయ రాష్ట్రానికి పారిపోయారని ఇక్కడ పూర్తి అనే పేరు గల వ్యక్తిని కలిశారని బంగ్లా పోలీసులు తెలిపారు. సామి అనే ట్యాక్సీ డ్రైవర్ ఆ ఇద్దర్ని మేఘాలయలోని తురా నగరానికి తీసుకెళ్లాడని చెప్పారు. అయితే భారత అధికారులు హత్య కేసు అనుమానితులకు సహాయం చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారని బంగ్లా పోలీసులు వెల్లడించారు. బంగ్లా నుంచి పారిపోయిన ఇద్దర్ని తమకు అప్పగించే విషయంలో భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.









