Asia Cup Final | ఆసియా కప్ చరిత్రలోనే అరుదైన పరిణామం చోటుచేసుకుంది. 1984లో ఆసియా కప్ మొదలు కాగా తొలిసారి భారత్-పాకిస్థాన్ జట్లు ఫైనల్ లో తలపడుతుండడం విశేషం. అలాగే ఒకే సీజన్ లో ఈ రెండు జట్లు ముచ్చటగా మూడు సార్లు ఎదురుపడడం కూడా ఇదే తొలిసారి.
ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచుపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ ఎడిషన్ లో రెండు సార్లు పాక్ ను మట్టికరిపించింది టీం ఇండియా ఫైనల్ లోనూ అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమయ్యింది. సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్ ను ఓడించిన భారత్ ఫైనల్ లోకి ప్రవేశించింది.
అదే విధంగా బంగ్లాతో ఉత్కంఠబరితంగా సాగిన మ్యాచులో గెలిచిన పాకిస్థాన్ సైతం ఫైనల్స్ లో అడుగుపెట్టింది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో దాయాధి దేశాలు ఫైనల్స్ లో తొలిసారి తలపడనున్నాయి. ఇకపోతే ఇప్పటివరకు 10 సార్లు ఫైనల్ చేరిన భారత్ ఎనిమిది సార్లు విజేతగా నిలిచింది. ఆ తర్వాత శ్రీలంక ఆరు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు ఆసియా కప్ టైటిల్ ను నెగ్గింది.
ఈ ఎడిషన్ లో రెండు సార్లు భారత్-పాక్ తలపడిన మ్యాచులు వివాదంగా మారాయి. పాకిస్థాన్ ఆటగాళ్ల అత్యుత్సాహం విమర్శలకు కారణం అయ్యింది. రెచ్చగొట్టే విధంగా ఆ దేశ ఆటగాళ్ల వెకిలి చేష్టల పట్ల భారత అభిమానులు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. ఫైనల్ లోనూ పాక్ ను మట్టికరిపించి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు









