Pawan Kalyan Wishes Chandrababu | ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu Naidu) ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి సోమవారం నాటికి 30 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా సీఎం చంద్రబాబును ఉద్దేశించి ప్రత్యేక సందేశం విడుదల చేశారు. చంద్రబాబు దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి అని కొనియాడారు.
“భవిష్యత్తును ఊహించి ప్రణాళికబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దార్శనికుడు చంద్రబాబు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
పాలనా దక్షతతో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, సంస్కరణలు అభివృద్ధిని పరుగులు పెట్టించాయి. పాలనలో ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా సవాళ్లుగా స్వీకరించి ముందడుగు వేశారు.
90వ దశకంలో ఆయన ఐటీ రంగానికి పెద్దపీట వేయడం వల్లే తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామాల నుంచి ఐటీ ఉద్యోగులు వచ్చారు.
రైతు బజార్ల ఏర్పాటు, డ్వాక్రా సంఘాల స్థాపన, పేదల కోసం వెలుగు ప్రాజెక్టు ప్రారంభం, మీసేవా కేంద్రాల ఏర్పాటు వంటి నూతన ఆవిష్కరణలు చంద్రబాబు ముందుచూపునకు నిదర్శనం.
దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి నిర్దేశకత్వంలో మా మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తోంది” అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.









