కొల్లాపూర్: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోలేదని, ప్రజల మనసులు గెలిచానని కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిన శిరీష (బర్రెలక్క) చెప్పారు. స్వతంత్య్ర అభ్యర్థిగా 6 వేల ఓట్లు సాధించడమంటే ప్రజల మనసుల్లో తాను ఉన్నట్లేనని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి తనకు కేవలం ఏడు రోజులే సమయం దొరికిందని, ఈ ఏడు రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లలేకపోయానని తెలిపారు.అదేవిధంగా తనపై తప్పుడు ప్రచారం జరగడం, తన వయస్సు చిన్నది కావడంతో సరిగా పనిచేయలేనేమోనని ప్రజలు భావించడం, పోలింగ్‌కు ఏడు రోజుల ముందే నామినేషన్ వేసినందున తనను నమ్మేందుకు ప్రజలకు తగినంత సమయం దొరకకపోవడం తన ఓటమికి కారణాలని చెప్పారు.
ఎన్నికల ఓడినా నిరుద్యోగల పక్షాన తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు.కాగా, నిరుద్యోగుల సమస్యలపై పోరాటం కోసం అంటూ శిరీష (బర్రెలక్క) ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో ఆమె 5,754 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు 93,609 ఓట్లతో విజయం సాధించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డికి 63,678, బీజేపీ అభ్యర్థి అల్లేని సుధాకర్ రావుకు 20,389 ఓట్లు వచ్చాయి.