Independence Day స్వతంత్య్ర భారతావని 74 వసంతాలు పూర్తి చేసుకుంది. నేటితో 75వ పడిలోకి అడుగు పెట్టింది. యావత్ దేశం స్వాతంత్య్ర దిన వజ్రోత్సవాలు చేసుకుంటోంది.
దాదాపు రెండు దశాబ్దాలు తెల్ల దొరల ఆక్రమణలకు.. ఆకృత్యాలకి బలైన భరతమాత సంకెళ్లు తెంచిన వీరులను సంస్మరించుకునే రోజుది. బ్రిటిషోళ్లను బార్డర్లు దాటించి.. బానిసత్వానికి చరమగీతం పాడేశారెందరో సమరయోధులు.
మా దేశం.. మా ప్రజలం.. మా పాలన అంటూ యావత్ భారతీయులకు స్వేచ్ఛను ప్రసాదించారు. నిస్వార్థంగా ప్రాణత్యాగాలు చేసి ప్రపంచం గర్వించేలా తీర్చిదిద్దుకోండి అంటూ ముందు తరాలకు దేశాన్ని అప్పగించారు.
మరి ఆ త్యాగధనుల ఆశయాలు నెరవేరాయా.. వారి ఆకాంక్షల భారతావని సిద్దిస్తుందా.. ఆ దిశగా అడుగులు పడుతున్నాయా అంటే కచ్చితంగా అవును అని సమాధానం చెప్పలేని పరిస్థితి!!
Read Also: స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీనే ఎందుకు..!
వాస్తవానికి బ్రిటీషోళ్లను తరిమేశామని మనం గొప్పలు చెప్పుకుంటాం కానీ.. మన దగ్గర దోచుకోవడానికి ఏమీ లేదని తెలిశాకే వెళ్లిపోయారు వాళ్లు.
వనరులు, వజ్రాలు.. అన్నింటినీ ఖాళీ చేసేశారు. ఇక ఏమీ మిగల్లేదనే తమ దారి తాము చూసుకున్నారు.
ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి వేల ప్రాణాలు బలయ్యాయి. ఊరుకొక వీరుడు.. వీధికొక అమరుడు.. మనకు కనిపించేది, వినిపించేది గాంధీనే.. ఇక్కడ మహాత్ముడిని విమర్శించే ఉద్దేశం ఎంతమాత్రమూ కాదు.
కానీ చరిత్రలో కనుమరుగైన, తెరవెనుకే ఉండిపోయిన స్వాతంత్య్ర పోరాట వీరులెందరో.. బ్రిటీషోడి తుపాకీ గుండ్లకు రొమ్ము చూపి నిలబడ్డ హీరోలెందరో.. అంతేకానీ ఒక్కరితో మనకు స్వాతంత్య్రం రాలేదు..
75 ఏళ్లు గడిచిపోయింది.. అమృతోత్సవ్ పేరుతో వేడుకలు చేసుకుంటున్నాం. ఎందరో పోరాడి, ప్రాణాలు కోల్పోయి తెచ్చిచ్చిన స్వాతంత్య్రాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం.. అప్పటికీ ఇప్పటికీ వచ్చిన తేడాలేంటి?
అప్పుడు డాలర్ తో సమానంగా ఉన్న రూపాయి.. ఇప్పుడు డాలర్ కు 75 రూపాయలు అయ్యే స్థాయికి ఎదిగాం.
130 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే ఎంపీలు పార్లమెంటులో పేపర్లు చించుతూ, కొట్టుకుంటూ, టేబుళ్లు ఎక్కి ఎగిరే స్థాయికి అభివృద్ధి చెందాం..
కులాల పేరుతో సోషల్ మీడియాలో కొట్టుకునేంత ఎత్తుకు ఎగబాకాం.. అమ్మ తిట్టిందనో.. నాన్న అరిచాడనో ఆత్మహత్యలు చేసుకునేంత పెద్దోళ్లమయ్యాం.
పేదలు మరింత పేదలుగా.. ధనికులు మరింత ధనికులుగా మారడాన్ని చూస్తున్నాం.. ధనికుల వైపు పాలకులు నిలబడే పరిస్థితికి సాక్ష్యులుగా ఉన్నాం. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో మనం సాధించిన అభివృద్ధి ఇదీ.
అఫ్‌కోర్స్.. ఉండొచ్చు.. అప్పటికీ ఇప్పటికీ ఎంతో కొంత అభివృద్ది ఉండొచ్చు. కానీ అభివృద్ది కన్నా అవినీతే మించిపోయింది వాస్తవం కాదా. ఈ 75 ఏళ్లలో బయటపడిన కుంభకోణాలు కొన్నైతే.. బయటికి రానివి మరెన్నో.
75 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఒక పేదవాడు సరైన సమయానికి వైద్యం అందక మరణించడం వాస్తవం కాదా. ఖరీదైన వైద్యం చేయుంచుకునే స్తోమత లేక రోజూ ఎన్నో పసిప్రాణాలు గాల్లో కలిసిపోతున్న మాట నిజం కాదా.
ఒక నిర్భయ, ఒక దిశ.. ఆక్రందన!! పబ్జీలో పోరాటం చేసే యువత.. ఉచితాల కోసం అర్రులు చాచే జనం.. డబ్బులతో ఓట్లు కొనే పాలకులు.. పాలకులను నడిపించే కార్పొరేట్లు.. ఇవే మోడ్రన్ ఇండియా ఘనతలు.
Read Also: మరణించినా మళ్లీ జీవించండి.. మరొకరికి జీవితాన్నివ్వండి!
స్వాతంత్య్రం సాధించింది ఇందుకేనా..
ఇష్టమొచ్చినట్లు బతకడమేనా స్వాతంత్య్రమంటే.. ప్రధానిని కూడా చిల్లర మాటలతో విమర్శించడమేనా స్వాతంత్య్రమంటే..
డబ్బులున్నాయని ప్రజాప్రతినిధులను కొనడమేనా స్వాతంత్య్రమంటే… ప్రభుత్వాలు ఏం చేసినా భరిస్తూ కూర్చుకునేందుకేనా మనకు స్వాతంత్య్రం వచ్చింది.
కాదు.. కానే కాదు.. ఇంకేదో కారణముంది.. భగత్ సింగ్ పోరాడింది ఇందుకు కాదు.. గాంధీ దండి యాత్ర చేసింది ఇందుకు కాదు..
తెల్లోడి బుల్లెట్లకు మన్యం వీరుడు అల్లూరి ఎదురెళ్లింది ఇందుకు కాదు.. ఆజాద్ హింద్ ఫౌజ్ ను నేతాజీ స్థాపించిందీ ఇందుకు కాదు..
ఇంకేదో కారణముంది.. జవాబు చెప్పేదెవరు? మహాత్ములారా మన్నించండి. స్వాతంత్య్రం వచ్చింది కానీ.. మీ కలలు మేం పూర్తి చేయలేకపోయాం!! మీరు అనుకున్నదాన్ని మేం సాధించలేకపోయాం.
కానీ ఎక్కడో చిన్న ఆశ. మీ త్యాగం ఎప్పటికీ వృథా పోవద్దనే ఆరాటం. మీ త్యాగాల పునాదులపైన నిర్మించబడిన ఈ దేశం ఎప్పటికో అప్పటికీ మీరు కన్న కలలవైపు పయనిస్తుందనే విశ్వాసం. ఆ ఆశ ఇంకా దేశభక్తిని కాపాడుతుంది. ఆ రోజు ఎప్పటికైనా రావాలని సదా ఆకాంక్షిస్తాం. Happy Independence Day!!