Principal Murder Case Analysis తెలంగాణలోని నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి దారుణ హత్య సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తమకు విద్యాబుద్ధులు నేర్పించే గురువు మందలించారనే కోపంతో, జల్సాల కోసం అలవాటు పడ్డ పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అత్యంత క్రూరంగా కత్తులతో పొడిచి చంపారనే వార్త సున్నిత మనస్కులను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన మన సమాజపు నైతిక పతనానికి స్పష్టమైన హెచ్చరికగా కనిపిస్తోంది.
విద్యార్థుల మారిన ప్రవర్తన.. చదువుల రూపురేఖలు..
గతంలో బడి అంటే కేవలం పుస్తకంలోని పాఠాలు బోధించే కేంద్రం మాత్రమే కాదు.. విద్యార్థులకు చదువుతోపాటు క్రమశిక్షణ, సత్ప్రవర్తనను అలవరిచే శిక్షణాస్థలం. ఉపాధ్యాయుడు అంటే సమాజంలోనూ ప్రత్యేక గౌరవం ఉండేది. కానీ నేడు ర్యాంకులు, మార్కుల వేటలో విలువల విద్య దాదాపుగా పూర్తిగా మరుగున పడింది.
అందుబాటులోకి స్మార్ట్ ఫోన్లు, విచక్షణ లేని సోషల్ మీడియా వాడకం, గ్యాంగ్‌స్టర్ సంస్కృతిని గ్లోరిఫై చేసే సినిమాలు, ఆన్‌లైన్ గేమింగ్ విద్యార్థుల మానసిక సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. చిన్న విషయాలకే విపరీతమైన కోపం తెచ్చుకోవడం, క్షణికావేశంలో నేరాలకు పూనుకోవడం ఈనాటి యువతలో ప్రమాదకరస్థాయికి చేరింది.
అందుకే ప్రతి పాఠశాలలోనూ విధిగా ‘మోరల్ సైన్స్’ (నైతిక విలువలు) తరగతులు నిర్వహించాలి. మానసిక నిపుణులతో క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ ఇప్పించాలి. విద్యాసంస్థల భద్రతతో పాటు విద్యార్థుల క్రమశిక్షణను పర్యవేక్షించేందుకు కఠినమైన నిబంధనలు అమలు చేయాలి.
విస్తరిస్తున్న ‘గంజాయి, డ్రగ్స్‘ మహమ్మారి..
నేటి విద్యార్థుల్లో ఇలాంటి మార్పునకు ప్రధాన కారణాల్లో రాష్ట్రవ్యాప్తంగా విషవృక్షంలా విస్తరిస్తున్న మత్తు పదార్థాల సంస్కృతి కూడా ఒకటి. ఒకప్పుడు గుట్టు చప్పుడు కాకుండా కేవలం పట్టణాలకే పరిమితమైన గంజాయి, డ్రగ్స్ నేడు పల్లెటూర్లలోని బడుల దాకా పాకాయని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. జల్సాలకు, ఈ వ్యసనాలకు అలవాటు పడిన విద్యార్థులు డబ్బుల కోసం ఎలాంటి ఘాతుకానికైనా వెనుకాడడం లేదు. ఈ మహమ్మారి యువత నరనరాల్లోకి ఇంకిపోయి వారి భవిష్యత్తును బూడిద చేస్తోంది.
తల్లిదండ్రుల బాధ్యత కూడా..
ప్రస్తుతం సమాజంలో రేపటి పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులదీ కీలక పాత్రే. కేవలం పిల్లలకు ఏది అడిగితే అది కొనివ్వడం, బడికి పంపడంతోనే బాధ్యత తీరిపోలేదు. పిల్లల ప్రవర్తనలో వస్తున్న హఠాత్తు మార్పులను, వారి అలవాట్లను, స్నేహితులను నిరంతరం గమనించాల్సిన అవసరం చాలా ఉంది.
చిన్న చిన్న విషయాలకు తీవ్రంగా కోపపడటం, ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండటం లేదా ఉన్నట్లుండి అతిగా మాట్లాడటం వంటివి గమనించాలి. దినచర్య & నిద్రరాత్రివేళల్లో అర్థరాత్రి వరకు మేల్కొని ఉండటం, ఉదయాన్నే లేవడానికి తీవ్ర ఇబ్బంది పడటం, ఆకలి మందగించడం వంటి శారీరక మార్పులను కనిపెట్టడం.
రోజువారీ ఖర్చులకు ఇచ్చే డబ్బు పరిమితి దాటుతోందా? అదనపు డబ్బుల కోసం పదే పదే ఒత్తిడి తెస్తున్నారా? ఆ డబ్బును దేనికి ఉపయోగిస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఫోన్ లేదా లాప్‌టాప్‌లలో అర్ధరాత్రి వరకు ఏ గేమ్‌లు ఆడుతున్నారు? సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు? పాస్ వర్డ్ లను సీక్రెట్‌గా ఉంచుతున్నారా? అని నిఘా ఉంచాలి.
స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎవరితో తిరుగుతున్నారు? కొత్త స్నేహితుల అలవాట్లు, నేపథ్యం ఏమిటి? వారి ఇళ్లకు లేదా బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో స్పష్టత ఉండాలి. ఇది వాళ్ల స్వేచ్ఛను హరించడంగా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి.
ప్రతిరోజూ రాత్రి కనీసం 15-20 నిమిషాలు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, స్కూల్లో లేదా వారి మనసులో జరుగుతున్న విషయాలను వినాలి. వారు తమ మనసు విప్పి మాట్లాడే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. సోషల్ మీడియాలో వేసే చాలా ఎరల నుంచి వారిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా వారు తప్పుడు దారిలో పయనించే ప్రమాదం ఉంది.
మత్తు పదార్థాల వినియోగంపై కఠిన చర్యలు..
ప్రస్తుతం గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం గుట్టు చప్పుడు కాకుండా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పూర్తిగా నిర్మూలన సాధ్యం కావడం లేదు.
అందుకే మత్తు పదార్థాల సరఫరా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా డ్రగ్ పెడ్లర్స్ పై ఏమాత్రం ఉపేక్షించవద్దు. అందుకే పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో గంజాయి, డ్రగ్స్ విక్రయించే ముఠాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. నిరంతర నిఘా ఏర్పాటు చేయాలి.
రూపా రెడ్డి గారి ఘటన కేవలం ఒక హత్యకేసు కాదు, అది మన సామాజిక ఆరోగ్యానికి తగిలిన కోలుకోలేని దెబ్బ. విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇలా అందరికీ సమాన బాధ్యత ఉంది.
అందుకే వారు చేసే నేరాల్లో దోషులు వారే కాదు.. ఈ సమాజం కూడా. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మేల్కోకపోతే మన భవిష్యత్తు తరాలు నేరమయంగా మారే ప్రమాదం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. తస్మాత్ జాగ్రత్త!







