– ‘ఫాల్తా’ బరి నుండి జహంగీర్ ఖాన్ అవుట్!
TMC candidate Jahangir Khan withdraws nomination | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక మార్పు తర్వాత అక్కడ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మే 21న జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఫాల్తా’ అసెంబ్లీ నియోజకవర్గ రీపోలింగ్ (Repoll) రేసు నుండి తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థి జహంగీర్ ఖాన్ మంగళవారం అకస్మాత్తుగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మే 24న జరగనుంది.
ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో 207 స్థానాల భారీ మెజారిటీతో బీజేపీ ల్యాండ్‌స్లైడ్ విక్టరీ సాధించి, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా తొలిసారి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన జహంగీర్ ఖాన్.. రీపోలింగ్ బరి నుంచి తాను తప్పుకోవడంపై జహంగీర్ ఖాన్ స్పందించారు. “ఫాల్తా ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడటం, గరిష్ట అభివృద్ధిని సాధించడమే నా ప్రధాన లక్ష్యం. ‘సోనార్ ఫాల్తా’ నా కల.
మన ముఖ్యమంత్రి (సువేందు అధికారి) ఫాల్తా ప్రజల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తున్నారు. అందుకే నేను నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
ఇది పార్టీ ఒత్తిడి వల్ల తీసుకున్న నిర్ణయమా అని ప్రశ్నించగా.. ఫాల్తా ప్రజల శాంతి, అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దాటవేశారు.
అభ్యర్థి నిర్ణయానికి టిఎంసి దూరం..
మరోవైపు జహంగీర్ ఖాన్ నిర్ణయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తృణమూల్ కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయమని చెప్తూనే, బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది.
మే 4న ఫలితాలు వచ్చినప్పటి నుండి ఒక్క ఫాల్తాలోనే 100 మందికి పైగా టిఎంసి కార్యకర్తలను అరెస్ట్ చేశారని, పార్టీ ఆఫీసులను బలవంతంగా ఆక్రమించారని ఆరోపించింది.
బీజేపీ బెదిరింపులకు కొందరు లొంగిపోయి మైదానం వీడారని, అయినా తాము బెంగాల్ లోనూ, ఢిల్లీలోనూ ‘బంగ్లా విరోధి బీజేపీ’పై పోరాటం కొనసాగిస్తామని టిఎంసి ఒక ప్రకటనలో పేర్కొంది.
డైమండ్ హార్బర్ పరిధిలో చెల్లని ‘మమతా-అభిషేక్’ మ్యాజిక్..
ఈ ‘ఫాల్తా’ నియోజకవర్గం టిఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ ఎంపీ స్థానం పరిధిలోకి వస్తుంది. మే 4 ఫలితాల తర్వాత ఈ నియోజకవర్గంలో మాజీ సీఎం మమతా బెనర్జీ గానీ, అభిషేక్ బెనర్జీ గానీ కనీసం ఒక్క ర్యాలీ లేదా పబ్లిక్ మీటింగ్ కూడా నిర్వహించకపోవడం గమనార్హం.
సీఎం సువేందు అధికారి సెటైర్లు..
జహంగీర్ ఖాన్ తప్పుకోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గట్టి కౌంటర్ ఇచ్చారు. “కనీసం పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకకపోయేసరికి భయపడి పారిపోయాడు” అంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ కూడా గతంలో జహంగీర్ ఖాన్ చేసిన ‘పుష్ప’ డైలాగులను గుర్తు చేస్తూ తీవ్రంగా స్పందించారు..
“గతంలో కొందరు ఇక్కడ ‘పుష్ప’లా యాక్ట్ చేయాలని చూశారు. కానీ ఈసారి పుష్ప ‘ఫుస్’ (ఫ్లాప్) అయిపోయింది. డైమండ్ హార్బర్ లో ‘ఏబీ (అభిషేక్ బెనర్జీ) ఝుకేగా నహీ’ అంటూ పోస్టర్లు వేశారు. కానీ ఇప్పుడు అందరూ వంగుతున్నారు. అభిషేక్ ఏజెంట్ లొంగిపోయాడు, త్వరలోనే అభిషేక్ కూడా లొంగుతాడు” అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అసలు రీపోలింగ్ ఎందుకు వచ్చింది..
ఏప్రిల్ 29న ఫాల్తాలో జరిగిన పోలింగ్‌లో అనేక అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. పలు పోలింగ్ బూత్‌లలో బీజేపీ అభ్యర్థి పేరు, గుర్తు ఉన్న ఈవీఎం (EVM) బటన్లపై వైట్ టేప్ అంటించి కప్పివేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ప్రస్తుతం సీఎం సువేందు అధికారికి సలహాదారుగా ఉన్న స్పెషల్ పోల్ అబ్జర్వర్ సుబ్రతా గుప్తా నేతృత్వంలో జరిగిన విచారణ అనంతరం.. ఎన్నికల సంఘం (EC) మొత్తం ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఆదేశించింది.







