Wednesday 20th May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > స్త్రీ శక్తి’ పథకం రద్దు..క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం!

స్త్రీ శక్తి’ పథకం రద్దు..క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం!

AP Stree Shakti free bus scheme update | ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం ‘స్త్రీ శక్తి’ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

రాష్ట్రంలో డీజిల్ బస్సులను తగ్గించి, వాటి స్థానంలో భారీగా ఎలక్ట్రిక్ బస్సులను (EV Buses) తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని.. ఈ-బస్సులు వస్తే మహిళలకు ఉచిత ప్రయాణం పూర్తిగా నిలిచిపోతుందంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ (YSRCP) ఆందోళన వ్యక్తం చేసింది.

 ఈ ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో గందరగోళానికి దారితీయడంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక ఫాక్ట్ చెక్ విభాగం రంగంలోకి దిగి ఈ అంశంపై పూర్తి స్పష్టతనిచ్చింది.

ప్రభుత్వ ఫాక్ట్ చెక్ క్లారిటీ..
డీజిల్ బస్సుల స్థానంలో కొత్తగా తీసుకొస్తున్న ఈ-బస్సుల వల్ల ఉచిత ప్రయాణ పథకం కనుమరుగవుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘స్త్రీ శక్తి’ పథకాన్ని రద్దు చేసే ఆలోచనే ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా ప్రభుత్వం గత 9 నెలలకు సంబంధించిన అధికారిక గణాంకాలను విడుదల చేసింది.

67 కోట్ల ఉచిత ప్రయాణాలు..
గత 9 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు బస్సుల్లో సుమారు 67 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించారు.  మహిళల ఉచిత ప్రయాణాలకు సంబంధించి అయిన రూ. 2,350 కోట్ల భారీ సబ్సిడీ భారాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరించింది.

ఆర్టీసీకి నిధుల విడుదల..
ఈ సబ్సిడీ మొత్తంలో ఇప్పటికే రూ. 720 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీ (APSRTC) ఖాతాకు తిరిగి చెల్లించింది. ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను అందించడం కోసమే కొత్త బస్సులను తెస్తున్నామని ప్రభుత్వం వివరించింది.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి రాబోతున్న 1,450 కొత్త ఈవీ బస్సులు కేవలం ప్రయాణికుల సౌకర్యార్థం మరియు పర్యావరణ పరిరక్షణ కోసమేనని, వీటి రాకతో పాత పథకాలకు ఎలాంటి ఢోకా ఉండదని స్పష్టం చేసింది. తప్పుడు రాజకీయ ప్రచారాలను నమ్మవద్దని సూచించింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions