- ఆ శాఖకు ఆయనెలా పనికొస్తారు?
– ఎక్స్ X వేదికగా సంచలన పోస్ట్!
Actor Vishal tweet on Tamilnadu CM Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన టీవీకే (TVK) అధినేత దళపతి విజయ్ తీసుకున్న ఒక కీలక నిర్ణయంపై కోలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత విశాల్ బహిరంగంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
విజయ్ క్యాబినెట్‌లో నూతన ఎమ్మెల్యే రాజ్ మోహన్‌కు ‘సినిమాటోగ్రఫీ శాఖ’ కేటాయించడంపై విశాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆదివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
అనుభవం లేని వ్యక్తికి మంత్రి పదవా?
“సినిమా పరిశ్రమ గురించి ఎలాంటి అవగాహన, కనీస అనుభవం లేని ఒక ఎమ్మెల్యేకు సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖను కేటాయించడం సరైన నిర్ణయం కాదు. రాజ్ మోహన్ గారిని కించపరచడం నా ఉద్దేశం కాదు.. కానీ ఇండస్ట్రీ సమస్యలపై పట్టున్న వ్యక్తి ఆ పదవిలో ఉంటే బాగుండేది” అని విశాల్ అభిప్రాయపడ్డారు.
విజయ్‌కు అన్నీ తెలుసు కదా?
“స్వయంగా విజయ్ గారికి సినీ పరిశ్రమతో 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ఇండస్ట్రీ పడుతున్న ఇబ్బందులు, ఇక్కడి సమస్యలు ఆయనకు బాగా తెలుసు. అలాంటప్పుడు ఎలాంటి అనుభవం లేని వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే.. మేము మా సమస్యలను ఆయనకు ఎలా వివరించగలం? ఆయనెలా అర్థం చేసుకోగలరు?” అని విశాల్ ప్రశ్నించారు.
సీఎం విజయ్‌కు విశాల్ 3 కీలక సూచనలు..
మంత్రి పదవి కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే, తమిళనాడు సినీ పరిశ్రమను బతికించుకోవడానికి ముఖ్యమంత్రి విజయ్‌కు విశాల్ కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు.
ప్రభుత్వ టికెటింగ్ విధానం..
సినిమా టికెట్ల విక్రయాల కోసం ప్రభుత్వమే ఒక ప్రత్యేక అఫీషియల్ టికెటింగ్ సిస్టమ్‌ను తీసుకురావాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా, సామాన్య ప్రేక్షకుడికి బ్లాక్ టికెట్ల దందా నుండి పెద్ద ఉపశమనం లభిస్తుంది.
స్థానిక పన్ను రద్దు..
దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం (GST) అమలవుతున్నా, తమిళనాడులో మాత్రం అదనంగా స్థానిక సంస్థల పన్ను విధిస్తున్నారు. దీనివల్ల పరిశ్రమ నష్టపోతోంది కాబట్టి తక్షణమే ఆ పన్నును రద్దు చేయాలి.
చిన్న సినిమాలకు సపోర్ట్..
తమిళంలో చిన్న చిత్రాలు బతికితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అందుకే చిన్న సినిమాలను ప్రోత్సహించేలా ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, ఇన్సెంటివ్‌లు అందించాలి.







