- లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ తో ప్రాణం పోసిన వైద్యులు!
Osmania Hospital Liver Transplantation | హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) వైద్యులు మరో అరుదైన ఘనతను సాధించారు.
ప్రాణాంతకమైన ‘గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్’తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి అత్యంత క్లిష్టమైన కాలేయ మార్పిడి (Liver Transplantation) శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
10 కిలోల బరువున్న ఈ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు తండ్రి ముందుకు వచ్చారు. ఆయన కాలేయం నుండి కొంత భాగాన్ని సేకరించి, చిన్నారికి అమర్చారు.
ఉస్మానియా వైద్యుల బృందం సుమారు 14 గంటల పాటు శ్రమించి ఈ సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ. లక్షల్లో ఖర్చయ్యే ఈ చికిత్సను తెలంగాణ ప్రభుత్వ ‘ఆరోగ్యశ్రీ’ పథకం కింద పూర్తిగా ఉచితంగా అందించారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆస్పత్రుల్లో ఇలాంటి క్లిష్టమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం అత్యంత అరుదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
వైద్య బృందానికి మంత్రి అభినందనలు..
ఈ అద్భుత ఘనత సాధించిన ఉస్మానియా వైద్యుల బృందాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనడానికి ఈ శస్త్రచికిత్సే నిదర్శనమన్నారు.








