MLC Kavitha Gets Emotional | తెలంగాణ జాగృతి (Telangana Jagrithi) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సోమవారం శాసనమండలిలో ప్రసంగించారు. ఈ క్రమంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టుకున్నారు.
తన రాజకీయ ప్రయాణం, తాను ఎదుర్కొన్న సవాళ్లు, ఎదురైన అనుభవాలను ప్రస్తావిస్తూ సభలోనే కన్నీటి పర్యాంతమయ్యారు. అనంతరం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
నాలుగు కోట్ల మంది ప్రజలకు 40మంది ఎమ్మెల్సీలు ఉంటే, అందులో తనకూ అవకాశం దక్కినందుకు నిజామాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
ప్రొఫెసర్ జయ శంకర్, కేసీఆర్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 2006 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు. 20ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని పేర్కొన్నారు.
సొంత పార్టీ నుంచి కూడా తాను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీతో విభేదాల వల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానన్నారు.
ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన బీఆరెస్ పార్టీకి, నిజామాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్ ను కోరారు.









