KTR Reaction on IndiGo flight Cancellation | దేశవ్యాప్తంగా నెలకొన్న ఇండిగో విమానాల సంక్షోభం మూలంగా ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదురుకుంటున్నారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మోనోపలీ వల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందో, ఇండిగో విమానయాన సంస్థ వల్ల ప్రయాణికులకు ఐదు రోజులుగా జరిగిన అసౌకర్యం ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన ట్రేడ్ యూనియన్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల సంస్థలు కొంతమంది చేతుల్లో పెట్టడం వల్ల ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయని విమర్శలు గుప్పించారు. శ్రమదోపిడీ వల్లే ఇదంతా జరిగిందన్నారు.
ఐదు రోజుల్లో వెయ్యికి పైగా విమానాలు రద్దు అయిన విషయాన్ని ప్రస్తావించారు. ఇండిగో ఒత్తిడికి కేంద్రమే తలొగ్గింది తప్ప, ఇండిగో తగ్గలేదన్నారు. కేంద్రం ఐదు రోజుల తర్వాత స్పందించడం వల్ల ఎయిర్‌పోర్టులు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లుగా మారాయని ధ్వజమెత్తారు. కొత్త లేబర్ కోడ్‌లు అమల్లోకి వస్తే ఇండిగో వల్ల జరిగిన అసౌకర్యం మిగతా రంగాలకు విస్తరిస్తుందని పేర్కొన్నారు.









