Cm Chandrababu News | వంగవీటి మోహనరంగా విగ్రహానికి అవమానం జరగడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండిలో శుక్రవారం రాత్రి కొందరు దుండగులు వంగవీటి విగ్రహంపై దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. వంగవీటి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా దుశ్చర్యకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
ఈ ఘటనలో నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. నేతల విగ్రహాల పట్ల అవమానకర చర్యలకు పాల్పడేవారికి గట్టి గుణపాఠం చెప్పేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు.









