Pawan Kalyan To Campaign In Maharastra Assembly Elections | మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ( Maharastra Assembly Elections ) జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్.డి.ఏ. ( NDA ) అభ్యర్థులకు మద్దతుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేయనున్నారు.
మహారాష్ట్రలో రెండు రోజులపాటు జనసేన అధినేత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఎన్.డి.ఏ. కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మరట్వాడా ( Marathwada ), విదర్భ ( Vidarbha ), పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో ప్రచారం షెడ్యూల్ ఖరారు నిమిత్తం బి.జె.పి. జాతీయ స్థాయి, మహారాష్ట్ర నాయకులు జనసేన నాయకులతో చర్చించారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ అయిదు బహిరంగ సభల్లో, రెండు రోడ్ షోల్లో పాల్గొంటారు. మొదటి రోజు మరట్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు.
16వ తేదీ ఉదయం నాందేడ్ ( Nanded ) జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. కాగా గత కొన్నిరోజులుగా సనాతన ధర్మం ( Sanatana Dharma )పై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సందర్భంగా పవన్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో అనేది ఆసక్తిగా మారింది.