Shabarimalai | శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్నారు. కొద్ది రోజులుగా శబరిమలలో అయ్యప్ప స్వాములు తాకిడి మరింత పెరుగుతోంది. అంచనాలకు మించి భక్తులు వస్తుండటంతో ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు కూడా వారిని నియంత్రించలేని పరిస్థితులు నెలకొన్నాయి.
అయ్యప్ప దర్శనం ప్రారంభమైన నాటి నుంచి దాదాపు 40 రోజుల్లో 31 లక్షల మంది భక్తులు శబరిమలకు వచ్చినట్లు ఆలయ బోర్డు వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 1.12 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారని తెలిపింది.
దీంతో ఈ ఏడాది అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన వారితో శబరిమల ఆదాయం భారీగా పెరిగింది. ఈ 40 రోజుల కాలంలోనే దాదాపు రూ.204 కోట్లు దాటినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఇందులో కానుకల రూపంలో రూ. 63.89 కోట్లు రాగా.. అరవన ప్రసాదం ద్వారా రూ. 96.32 కోట్ల ఆదాయం ఆలయానికి వచ్చిందని తెలిపింది. ఇక అప్పం ప్రసాదం ద్వారా రూ. 12.38 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారి పేర్కొన్నారు.