8 ఏళ్ల తైక్వాండో చిచ్చరపిడుగు.. రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం!
Taekwondo Championship | మేడ్చల్-మల్కాజ్ గిరి (Medchel Malkajgiri) జిల్లాలోని ఉప్పల్ కు చెందిన 8 ఏళ్ల కట్కూరి ప్రణీత్ నందన్ తైక్వాండో ఛాంపియన్ షిప్ లో అదరగొట్టాడు.
ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్(Taekwondo Championship) లో పాల్గొని కాంస్య పతకం సాధించాడు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా తరఫున 3వ తెలంగాణ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ తైక్వాండో ఛాంపియన్షిప్-2025లో సబ్ జూనియర్ బాయ్స్ 25 కిలోల విభాగంలో ప్రణీత్ కాంస్య పతకం అందుకున్నాడు.
ఈనెల 12 నుంచి 14 తేదీల్లో జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల్ కేంద్రంలో ఈ పోటీలు జరిగాయి. బోడుప్పల్ లోని పల్లవి మోడల్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న కె.ప్రణీత్ నందన్ గత ఏడాది కాలంగా ఒలింపిక్ క్రీడ అయిన తైక్వాండోలో కోచ్ పితాని చైతన్య దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు.
ప్రణీత్ నందన్ గతంలో మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల స్థాయి పోటీల్లో పాల్గొని స్వర్ణం, రజత పతకాలూ సాధించాడు. ప్రణీత్ విజయం పట్ల అతడి తల్లిదండ్రులు నిఖిత ప్రసాద్, కోచ్ చైతన్య ఆనందం వ్యక్తం చేశారు.









