Ys Sharmila Phone Tapping Row | తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ అంశానికి సంబంధించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.
ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ముమ్మాటికీ నిజం అన్నారు. గతంలో తన ఫోన్ నూ కూడా ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. తన ఫోన్ తో పాటు, తన భర్త, దగ్గరి వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేశారని షర్మిల చెప్పారు. ఈ మేరకు బుధవారం విశాఖపట్నం విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు.
అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కలిసే ఈ పని చేశారని ఆమె ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ అవుతున్న విషయాన్ని వైసీపీకి చెందిన నేత వైవి సుబ్బారెడ్డే నిర్ధారించారని పేర్కొన్నారు.
‘హైదరాబాద్ లోని నివాసానికి వచ్చిన వైవి సుబ్బారెడ్డి నా ఫోన్ ట్యాప్ అవుతుందని నిర్ధారించారు. అలాగే నాకు సంబంధించిన ఒక ఫోన్ సంభాషణను కూడా వినిపించారు’ అని షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ ఒత్తిడి మూలంగా సుబ్బారెడ్డి ఈ విషయాన్ని అంగీకరిస్తారో లేదో అనేది తనకు తెలియదని షర్మిల చెప్పారు.
కేసీఆర్, జగన్ మధ్య ఉన్న సంబంధం ముందు రక్తసంబంధం కూడా చిన్నబోయిందన్నారు. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను వేగవంతం చేయాలని కోరారు.