YS Jagan On Bhogapuram Airport | భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఆదివారం ఉదయం తొలి విమానం ల్యాండ్ అయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత స్పందించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయని పేర్కొన్నారు. విజన్ వైజాగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడిందని తెలిపారు.
ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో జీఎంఆర్ గ్రూప్ అసాధారణ కృషి చేసిందని హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వైసీపీ పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేసినట్లు జగన్ చెప్పారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయిందన్నారు. ఆ రోజు చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచిందని పేర్కొన్నారు. అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కృషి, సహకారం తనకు ఎంతో గుర్తుందని జగన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.









