Ys Jagan News Latest | చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్.
మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆయన విమర్శించారు. చంద్రబాబు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం తనకు ఆవేదన కలిగించిందన్నారు. చంద్రబాబు రాగానే విద్యారంగాన్ని దెబ్బతీశారని జగన్ ఆరోపించారు.
అమ్మ వడి, నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, వసతి దీవెన వంటి పథకాలను ప్రభుత్వం నిలిపివేసిందని పేర్కొన్నారు. ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడంలేదు, చదువులు పూర్తిచేసినవారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లూ ఇవ్వడంలేదని, ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.