Ys Jagan News Latest | నాడు పిల్లనిచ్చిన మామకి నేడు జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే సొంతం అని ధ్వజమెత్తారు మాజీ సీఎం జగన్. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. చంద్రబాబు రాజకీయ దిగజారుడుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిలిపివేతే నిదర్శనం అని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవసరం లేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను గమనిస్తే రేవంత్-చంద్రబాబు మధ్య కుదిరిన రహస్య ఒప్పందానికి ఆమోద ముద్ర వేసినట్లే అని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరుకు సంజీవవి లాంటి రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఊపిరి తీస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని నిలిపివేయడం ద్వారా సీమను ఎడారిగా మార్చే కుట్ర జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ద్రోహాన్ని రాయలసీమ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు.. క్షమించరని జగన్ పేర్కొన్నారు.









